చోడవరం: సబ్బవరం–వెంకన్నపాలెం బీఎన్ రోడ్డుపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మల్లంపాలెం గ్రామానికి చెందిన బి.వెంకటరమణ తన స్నేహితుడు అప్పారావుతో కలిసి మోటారు సైకిల్‌పై అడ్డూరు నుంచి వెంకన్నపాలెం వైపు వస్తుండగా ఎదురుగా చోడవరం నుంచి విశాఖపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సు నర్సాపురం సెంటర్ వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్‌పై వెళుతున్న వెంకరమణ, అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108వాహనంలో అనకాపల్లి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చోడవరం పోలీసులు తెలిపారు. ఇదే ప్రదేశంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరగడం నెలరోజులు వ్యవధిలో ఇది రెండో సారి కావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులను ఇష్టారాజ్యంగా నడపడం వల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వాలని జనం కోరుతున్నారు.


