● ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో సమస్య తీవ్రతరం
● వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుబ్రహ్మణ్యం విమర్శ
పాడేరు రూరల్: మండలంలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రతరమైందని విమర్శించారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లోని బావులు, బోర్లు అడుగంటిపోవడంతో ప్రజలు కొండ వాగులు, పంట పొలాల్లోని ఊట గెడ్డలను ఆశ్రయిస్తూ కలుషితమైన నీటిని తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి మొదలైనప్పటికీ సంబంధిత అధికారులు, పాలకులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయలేదని, దీనివల్ల ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా పంచాయతీలకు అవసరమైన నిధులు కేటాయించలేదని, ఎన్నికల హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన జల్ జీవన్ మిషన్ పథకాలు నిరుపయోగంగా మారాయని.. ముఖ్యంగా వంట్లమామిడి, సలుగు, ఐనాడ, దేవపురం, కుజ్జెలి వంటి పంచాయతీల్లో పథకాలున్నా చుక్క నీరు అందడం లేదని మండిపడ్డారు. ప్రజా పాలనను విస్మరించి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలి. లేనిపక్షంలో ఐటీడీఏ ముట్టడికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పాడేరు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సరభ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ పాంగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


