చీడికాడ : చీడికాడ బీసీ బాలికల వసతి గృహంలో సిబ్బంది పెడుతున్న ఇబ్బందులపై విద్యార్థినులు చేసిన ఆరోపణలపై విచారణలో భాగంగా ప్రస్తుత ఇన్‌చార్జి వార్డెన్ లలితకుమారితో పాటు కుక్, కమాటి, నైట్ వాచ్‌ఉమన్‌ను తాత్కాలికంగా వేరే చోటుకు పంపిస్తున్నట్టు బీసీ వెల్ఫేర్ డీడీ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం రాత్రి చీడికాడ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పక్కా భవనం లేకపోవడంతో ప్రైవేట్ భవనంలోనే వసతి గృహం నిర్వహిస్తున్నారు. 100 మంది విద్యార్థి నులకు ఒకే హాల్ ఉండడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పక్కా భవనం 10 ఏళ్ల క్రితమే నిర్మాణం సగంలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం వసతి గృహంలో సమస్యలను చీడికాడ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విద్యార్థినులను ఆరా తీశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


