చింతపల్లి: పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యానికి గురైన పార్టీ కార్యకర్తను స్వయంగా తన వాహనంలో ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చూసి ప్రాణాపాయం తప్పించారు. బుధవారం ఎమ్మెల్యే అరగడపల్లి సందర్శనకు వెళ్లారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ కార్యకర్త ఎస్. రామ్మూర్తి కూడా ఉన్నారు. పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాక, రామ్మూర్తికి అకస్మాత్తుగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, బాధితుడిని తన సొంత వాహనంలోనే హుటాహుటిన చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రామ్మూర్తికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు, ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితుడిని పరామర్శించారు.కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిలోని ఇతర వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి లక్ష్మణ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కృష్ణారావు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కె. రామకృష్ణ, పార్టీ అధ్యక్షులు గిరి ప్రసా ద్, కార్యదర్శి వంతల చంటిబాబు పాల్గొన్నారు.


