ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వెంకటేశ్వరరావు
పాడేరు: బాల్య వివాహాల కారణంగా సామాజిక రుగ్మతలను పెంచడమే కాకుండా చట్టరీత్యా తీవ్ర నేరమని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని ఓనూరు, నందిగరువు గ్రామాల్లో బుదవారం బాల్య వివాహాల నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండకుండా చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ఆడపిల్లలకు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. ప్రధానంగా మాతా, శిశు మరణాలకు బాల్య వివాహాలే ప్రధాన కారణామన్నారు. ఆడ పిల్లలకు 18 ఏళ్లు, మగ పిల్లలకు 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్ట పరమైన శిక్షలు తప్పవన్నారు. ఆడ పిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహించాలన్నారు. అనంతరం ఓనూరు, నందిగరువు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రేషన్ డిపోలను తనిఖీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి జన్‌మన్ పథకంలో చేపడుతున్న గృహ నిర్మాణాలు వేగవంతం చేసుకోవాలని సూచించారు. సిట్ ఆర్గనైజేషన్ ద్వారా బాల్య వివాహాల అవగాహన ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజారత్నం, ఈదులపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి మనీష్, డిప్యూటీ ఎంపీడీవో రమేష్, ఎంఈవో విశ్వనాథం. ఈపీఐయూ రవికుమార్, సీడీపీవో శారదాదేవి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ కొండమ్మ, సీహెచ్‌వో చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


