అక్షరానికి ఫీజు ఉరి | - | Sakshi
Sakshi News home page

అక్షరానికి ఫీజు ఉరి

Mar 11 2026 7:39 AM | Updated on Mar 11 2026 7:39 AM

విద్యార్థుల పాలిట కూటమి సర్కార్‌ శాపం విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో దారుణం ఫీజు కట్టలేదని విద్యార్థిని బయటకు గెంటేసిన యాజమాన్యం పవన్‌ కల్యాణ్‌ని ప్రశ్నిస్తూ ఒక తండ్రి ఆవేదన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు

అక్షరానికి అభయం ఎక్కడ? పేదోడి చదువుకు భరోసా ఏది? కూటమి సర్కార్‌ కొలువుదీరిన వేళ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సెగ విద్యార్థుల భవిష్యత్తును దహించివేస్తోంది. అటు పాలకుల నిర్లక్ష్యం.. ఇటు యాజమాన్యాల మొండివైఖరి మధ్య సామాన్యుడి కలలు కల్లలవుతున్నాయి. సొంత పార్టీ ఎంపీ కాలేజీలోనే విద్యార్థులను గెంటేస్తుంటే, ‘మన ప్రభుత్వం’ అని నమ్మిన జనసేనాని అభిమానులే ఇప్పుడు సోషల్‌ మీడియా సాక్షిగా పాలకుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ’ముగ్గురు పిల్లల ముచ్చట పక్కన పెట్టండి.. ఉన్న ఇద్దరి చదువుల సంగతి చూడండి’ అంటూ ఒక తండ్రి వెళ్లగక్కిన ఆవేదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దావానలంలా మారుతోంది.

విశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఎన్నికల ముందు చదువుల తల్లికి అండగా ఉంటామని చెప్పిన పాలకులు, ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను గాలికి వదిలేయడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా విశాఖలోని దువ్వాడలో ఉన్న విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

సొంత పార్టీ ఎంపీ కాలేజీలోనే వేధింపులా?

నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు చెందిన ఈ కాలేజీలో, ప్రభుత్వం నుంచి రావాల్సిన మొదటి ఏడాది ఫీజు బకాయిలు రాలేదన్న సాకుతో విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను క్లాసులో నుంచి పంపించేశారని, ఇది ఎంతవరకు ధర్మమని పాయకరావుపేటకు చెందిన ఒక సామాన్య కాపు సామాజికవర్గ నాయకుడు, పవన్‌ కల్యాణ్‌ అభిమాని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

పవన్‌ కల్యాణ్‌కు సూటి ప్రశ్న

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి సదరు తండ్రి చేసిన వ్యాఖ్యలు బాణాల్లా తగులుతున్నాయి. ‘అయ్యా పవన్‌ కల్యాణ్‌ గారూ.. రెండేళ్లుగా టీడీపీతో సావాసం చేస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో సామాన్యుల కష్టాలు మీకు పట్టడం లేదు. ఎంపీలకు చెందిన కాలేజీలే ఇలా విద్యార్థులను గెంటేస్తుంటే, ఇక మా పిల్లల చదువులకు భరోసా ఎక్కడ?‘ అని ఆయన నిలదీశారు. గాలి మాటలు చెప్పడం మానేసి, విద్యార్థుల జీవితాలు నాశనం కాకుండా చూడండి’ అని డిమాండ్‌ చేశారు.

‘మూడో బిడ్డ’ ముచ్చట దేనికి?

ఉన్నవారికే దిక్కులేదు! : ప్రభుత్వం ప్రకటించిన ’మూడో బిడ్డకు రూ. 25 వేల ప్రోత్సాహం’ పథకంపై సదరు తండ్రి ఎద్దేవా చేశారు. ‘మొదటి దానికి మొగుడు లేడు.. కొసదానికి కల్యాణం అన్నట్లుంది మీ తీరు‘ అంటూ ఘాటుగా విమర్శించారు. ఉన్న ఇద్దరు పిల్లల చదువులకే దిక్కులేదని, మీ మాటలు నమ్మి మూడో బిడ్డను కంటే రోడ్డున పడటం ఖాయమని మండిపడ్డారు. రూ. 1750 కోట్లతో విగ్రహాలు పెట్టడం కంటే, ఆ నిధులను విద్యార్థుల ఫీజుల కోసం ఖర్చు చేస్తే ఎందరో పేదల భవిష్యత్తు నిలబడుతుందని ఆయన హితవు పలికారు.

రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఆందోళన

ఈ ఒక్క కాలేజీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేట్‌ విద్యాసంస్థలు పరీక్షా హాల్‌ టికెట్లు ఇవ్వకుండా, అటెండెన్స్‌ వేయకుండా విద్యార్థులను వేధిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే, వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక అభిమానిగా ప్రారంభమైన ఈ పోస్ట్‌ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఒక ప్రజా నిరసనగా మారుతోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో వైరల్‌గా అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement