అవగాహన కల్పిస్తాం
చింతపల్లి నుంచి పాపికొండలను కలుపుతూ మొత్తం తొమ్మిది లక్షల హెక్టార్లలో విస్తిరించిన ప్రాంతన్ని బయో రిజర్వ్‌గా చేయా లని ఉన్నతాధికారులు నిర్ణయించారు.ముందుగా గిరిజనుల్లో నెలకొన్న అనుమానాలు,అపోహలను తొలగించేందుకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని భావించాం.కలెక్టర్లు సైతం ఇదే సూచన చేశారు.ఈ ప్రాంతం బయో రిజర్వ్‌గా మారితే జంతువులకు,అడవికి రక్షణ లభిస్తుంది.
– వై.వి. నర్సింగరావు, డీఎఫ్‌వో, చింతపల్లి
●
కొయ్యూరు: మానవమనుగడ అడవులపై ఆధారపడి ఉంది. 33 శాతం అడవులు ఉంటేనే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. రాను రాను మానవ ఆవాసాలు పెరిగి అడవులు అంతరించిపోవడంతో ఉన్న అడవిని,జంతువులను కాపాడుకునేందుకు వీలుగా జీవ వైవిధ్య రక్షణ కోసం అటవీ శాఖ ముందడుగు వేసింది. మొదట లక్ష హెక్టార్లలో విస్తరించి ఉన్న మర్రిపాకల రేంజ్ నుంచి రంపచోడవరం, చింతూరు ప్రాంతాలను కలుపుతూ కనీసం నాలుగు లక్షల హెక్టార్లలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే పరిధి పెంచితే అటు యునెస్కో, ఇటు కేంద్రం ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు వచ్చే అవకాశం ఉండడంతో తొమ్మిది లక్షల హెక్టార్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
కేంద్రానికి నివేదిక
అల్లూరి, పోలవరం జిల్లాల అటవీశాఖ అధికారులు కలెక్టర్లతో కలిసి ప్రాజెక్ట్ నివేదికను తయారు చేసి రాష్ట్రప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదిస్తారు. నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.అటు యునెస్కో నుంచి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిపాదించిన ప్రాంతాన్ని బయో రిజర్వ్‌గా చేస్తే గ్రామాలను ఖాళీ చేయిస్తారన్న భయం గిరిజనుల్లో ఉంది.దీనిపై వారికి ఉన్న అపోహలను అటవీ అధికారులు తొలగించాల్సి ఉంది.
వృక్ష, జంతువుల రక్షణే లక్ష్యం
చెట్లను, జంతువులను సంరక్షించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం, అటవీ ప్రాంతంలో గల వివిధ రకాల వృక్షాలపై పరిశోధనలకు అవసరమైన అవకాశాలు కల్పించడమే బయో రిజర్వ్ ప్రధాన లక్ష్యం. దీనిలో మూడు రకాల జోన్లు ఉంటాయి. మొదటి జోన్‌లో రక్షిత అటవీ ప్రాంతం ఉంటుంది. దీనిలోకి ఎవరినీ అనుమతించరు. బఫర్‌గా రెండో జోన్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ జోన్‌లో పరిశోధనలతో పాటు ఇతర అంశాలకు అనుమతులు ఇస్తారు. మూడో జోన్‌లో మానవాభివృద్ధిలో భాగంగా పరిశీలన చేసేందుకు అనుమతులు ఇస్తారు.
18 బయో రిజర్వ్‌లు
మన దేశంలో ఇప్పటి వరకు 18 బయో రిజర్వ్‌లను ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లా మర్రిపాకల నుంచి పోలవరం జిల్లా పాపికొండల వరకు ఏర్పాటు చేయాలని భావిస్తున్న బయో రిజర్వ్‌కు అన్ని అనుమతులు వస్తే 19వ బయో రిజర్వ్ అవుతుంది.
ప్రకటించేందుకు అటవీ శాఖ నిర్ణయం
తొమ్మిది లక్షల హెక్టార్లలో విస్తరించిన అటవీ ప్రాంతం
గిరిజనులకు అవగాహన
కల్పించడంపై దృష్టి
జీవ వైవిధ్య పరిరక్షణకు
అటవీశాఖ నిర్ణయం
ఆమోదం లభిస్తే
యునెస్కో నుంచీ నిధులు


