17న నూకాంబిక కొత్త అమావాస్య జాతర | - | Sakshi
Sakshi News home page

17న నూకాంబిక కొత్త అమావాస్య జాతర

Mar 11 2026 7:39 AM | Updated on Mar 11 2026 7:39 AM

● అమ్మవారి నూతన ఆలయం, రాజగోపురం పునఃప్రతిష్టకు రూ.11.93 కోట్లు ● భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

అనకాపల్లి : ఉత్తరాంద్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి దేవాలయంలో అమ్మవారి జాతర మహోత్సవం ఈనెల 17న రాత్రి నుంచి 18 వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు జిల్లా దేవదాయశాఖ అధికారి సుధారాణి, ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను(గొల్లబాబు) తెలిపారు. అమ్మవారి ఆలయ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త అమావాస్య పండగను ఈనెల 18న నిర్వహించనున్నట్టు తెలిపా రు. 19వ తేదీన ఉగాది రోజున అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అమ్మవారి నూతన ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఏప్రిల్‌ 17వ తేదీ వరకూ అమ్మవారికి నెల పండగ వేడుకలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్‌ క్రీడామైదానంలో నెలరోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గత ఏడాది మాదిరిగానే నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించడంతో అమ్మవారికి పట్టువస్త్రాలను ప్రభుత్వం తరఫున జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి వంగలపూడి అనిత అందజేస్తారని చెప్పారు. అమ్మవారి ఆలయ, రాజగోపురం పునఃప్రతిష్ట నిర్మాణానికి రూ.11కోట్ల 93 లక్షలు ఖర్చు అయిందని, భక్తుల అమ్మవారికి కానుకుల రూపంలో సమర్పించిన నగదుతో నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్పారు. అమ్మవారి రాజగోపురం 100 అడుగులు ఉంటుందని, విజయవాడ కనకదుర్గ అమ్మవారి రాజగోపురం మాదిరిగానే నూకాంబిక అమ్మవారి రాజగోపురం నిర్మించినట్టు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో అమ్మవారి ఆలయం పునఃనిర్మాణపనులు ప్రారంభిస్తే, టీడీపీ పాలనలో రాజగోపురం ప్రారంభించారని పూర్తి చేసినట్టు చెప్పారు. ఈ నెల 8న అమ్మ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్టు వారు తెలిపారు. ప్రభుత్వం నుంచి త్వరలో రూ.7 కోట్ల నిధులు రానున్నాయని, ఈ నిధులతో మరికొన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో యాళ్ల శ్రీధర్‌, కమిటీ ధర్మకర్తలు సూరే సతీష్‌కుమార్‌; దాడి రవికుమార్‌, మారిశెట్టి శంకరరావు, కొడుకుల శ్రీకాంత్‌, కాండ్రేగుల రాజారావు, వడ్డాది మంగ, పొలిమేర స్వాతి ఆనంద్‌కుమార్‌, మజ్జి జానకీ శ్రీనివాసరావు, యర్రవరపు సంతోషి కుమార్‌ నాగేష్‌, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement