అచ్యుత్యాపురం రూరల్: మండలంలోని పూడిమడక తీరంలో కొండపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి దేముడు (41) మంగళవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 4.30 గంటలకు పూడిమడకకు చెందిన ఒరుపుల మసేను ఐఎన్‌డీ–ఏపీ–వీ3–ఎంఓ–2010 బోటుపై నలుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 20 మీటర్ల దూరంలో అలల తాకిడికి చోడిపల్లి దేముడు పడిపోయాడు. వెంటనే తోటి మత్స్యకారులు సముద్రంలో నుంచి బయటకు తీసినప్పటికే మృతి చెందాడు. మృతుడు భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దేముడు ఇక లేడన్న చేదు నిజం జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో తీరంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


