తుమ్మపాల: పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారుల సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. ప్రతి శాఖ అధికారి అర్జీల పరిష్కార పరిస్థితిని రోజూ పర్యవేక్షణ చేయాలని, గడువు లోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వారం పీజీఆర్‌ఎస్‌లో–128, రెవెన్యూ క్లినిక్‌లో–173, మొత్తం 301 అర్జీలు నమోదయ్యాయి. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రమామణి, సీపీవో జి.రామారావు, పలు శాఖల పీడీలు కె సరోజిని, శచీదేవి, సూర్యలక్ష్మి, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతుల డిమాండ్
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు తక్షణమే నష్టపరిహారం మంజూరు చేయాలని, లేనిచో నిషేధిత జాబితా నుంచి తొలగించి క్రయవిక్రయాలకు అనుమతించాలంటూ అనకాపల్లి మండలం తుమ్మపాల, సత్యనారాయణపురం, మూలపేట గ్రామాల రైతులు కలెక్టరేట్ గేటు వద్ద నిరసన చేపట్టారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ప్రాజెక్టులో భాగంగా ఐదేళ్ల క్రితం గెజిట్ విడుదల చేసి రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని వాపోయారు. అప్పటి నుంచి ఎటువంటి క్రయవిక్రయాలు చేసుకోలేక కుటుంబ అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 2013 భూ పరిహార చట్టం కింద మార్కెట్ విలువకు నాలుగు రెట్లు పరిహారం ఇవ్వాలని, ఐదేళ్లుగా సాగు చేయకుండా నిలిపివేయడంతో ఉపాధి కోల్పోయామని, ఈ కాలానికి పరిహారం కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతు నాయకులు పీలా మురళీ, సిహెచ్.పార్థసారథి, పి.వి.గంగునాయుడు, కోటేశ్వరరావు, ఆదినారాయణ, రైతులు పాల్గొన్నారు.
అధికార పార్టీ నేతల భూ ఆక్రమణపై దళితుల నిరసన
ఏళ్ల తరబడి సాగులో ఉన్న గ్రామకంఠం భూమిని అధికార పార్టీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన దళితులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. సర్వే నంబరు 127లో 8.40 ఎకరాల గ్రామకంఠం భూమిని తామంతా సాగు చేసుకుంటు జీవిస్తున్నామని, పట్టాలు, పాసుపుస్తకాలు మంజూరు చేయాలంటూ ఏళ్ల తరబడి అధికారులకు అర్జీలు చేస్తున్నా న్యాయం చేలేదని వాపోయారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు భూమిని ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసి ఆక్రమించేందుకు చూస్తున్నారన్నారు. తాము అడ్డుకుంటే బైండోవర్ చేసి భూమిలోకి రాకుండా చేస్తున్నారని, న్యాయం చేయాలంటు డిమాండ్ చేశారు. భూమిని సాగుచేస్తున్న తమకు హక్కు పట్టాలు మంజూరు చేయడంతోపాటు అధికార పార్టీ నాయకుల నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.


