నేడు తాజంగిలో హోలీ మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు తాజంగిలో హోలీ మహోత్సవం

Mar 3 2026 8:04 AM | Updated on Mar 3 2026 8:04 AM

చింతపల్లి: మండలంలోని తాజంగిలో హోలీ ఉత్సవాలను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ ఉత్సవాలను ఘనంగా మూడురోజుల పాటు నిర్వహిస్తారు. ఐదు దశాబ్దాల క్రితం జోలాపుట్‌ డ్యాం నిర్మాణంలో భాగంగా నిర్వాసితులైన వారికి అప్పటి ప్రభుత్వం తాజంగిలో ఆశ్రయం కల్పించింది. అప్పటి నుంచి ఆ కుటుంబీకులు మూడేళ్లకు ఒకసారి రామడోలీ ఉత్సవంతో పాటు ప్రతి సంవత్సరం హోలీ పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. వలస వచ్చిన ఒడియా సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయి.

60 అడుగుల టవర్‌ ప్రత్యేక ఆకర్షణ

తాజంగి బీటాలైన్‌లో జరిగే హోలీ పండగకు ఒక ప్రత్యేకత ఉంది. ఉత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన 60 అడుగుల టవర్‌(కర్రల నిచ్చెన) ఆకట్టుకుంటుంది. ఒడిశా సరిహద్దు నుంచి వలస వచ్చిన 50 కుటుంబాల వారు అనాదిగా ఈ పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. హోలీకి ముందు రెండు రోజుల ముందు నుంచి కొంత మంది యువకులు నిష్టగా ఉపవాసం ఉంటారు. కర్రల నిచ్చెన కోసం 60 అడుగుల ఎత్తు ఉండే చెట్టును కొట్టి అడవి నుంచి గ్రామానికి తీసుకువస్తారు.ఆ పెద్ద చెట్టుకు రాధా కృష్ణుల ఆలయం సమీపంలో భక్తి శ్రద్దలతో పూజలు చేసి,నిలబెడతారు. దాని చుట్టూ హోలీ ముందు రోజు సాయంత్రం కర్రలతో 60 అడుగుల మేర నిచ్చెనలా ఏర్పాటు చేసి, పైన జెండా కడతారు.మరుసటి రోజు తెల్లవారు జామున ఆ కర్రల నిచ్చెనకు పూజా కార్యక్రమాలు పూర్తి చేసి దహనం చేస్తారు. ఈ సందర్భంగా 60 అడుగుల పైన కట్టిన జెండా ఎటువైపు పడితే ఆ ప్రాంతంలో వర్షాలు పడి,పాడి పంటలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఆ జెండాను పట్టుకున్న వ్యక్తికి నగదు బహుమతి ఇవ్వడంతో పాటు రాధాకృష్ణుని ఆలయంలో గ్రామ పెద్దల సమక్షంలో సన్మానిస్తారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి తాజంగి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

కొండపడలో ...

ముంచంగిపుట్టు: మండలంలోని ఏనుగురాయి పంచాయతీ కొండపడలో ప్రతి ఏటా విభిన్నంగా హోలీ పండగను నిర్వహిస్తారు. అందులో భాగంగా మంగళవారం కర్రలు కాల్చే ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సుమారు 30 అడుగుల వరకు కట్టెలను పేర్చి, హోలీ రోజు తెల్లవారుజామున కాలుస్తారు. అలా కాల్చడం వల్ల గ్రామానికి సర్వదోషాలు పోయి,మంచి జరుగుతుందని గిరిజనుల నమ్మకం. ఈ ఉత్సవాన్ని చూసేందుకు చుట్టూ పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు వస్తారు.దార్రెల పంచాయతీ కేంద్రంలో సైతం హోలీ పండగను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ

కొండపడలో ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న

గిరిజనులు

60 అడుగుల(టవర్‌) కర్రల నిచ్చెన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement