ఆస్పత్రి పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
నర్సీపట్నం: ఏరియా ఆసుపత్రి అభివృద్ధి పనులపై తక్షణమే విజిలెన్స్ విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాబార్డ్ కింద మంజూరైన రూ.40 లక్షలతో జరుగుతున్న మరమ్మతులు, రంగుల పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించడంతో సంబంధిత కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో ఎటువంటి అవకతవకలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణను బ్లాక్ లిస్టులో పెట్టాలని సంబంధిత అధికారులను స్పీకర్ ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాశారదకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట కౌన్సిలర్ సిహెచ్.పద్మావతి ఉన్నారు.


