నిధులిస్తే ఒట్టు!
పేరుకే సంక్షేమ బోర్డు...
భవన నిర్మాణ కార్మికులపై కూటమి నిర్లక్ష్యం
● కార్మికులు దాచుకున్న నగదు ఎక్కడో..?
● సమస్యలపై స్పందించని ప్రభుత్వం
అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని బోర్డును ఏర్పాటు చేశారు. నేటికీ ఒక్కరూపాయి కూడా బోర్డుకు ఇవ్వలేదు. మరి సంక్షేమ బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న సంక్షేమ బోర్డులో నిధులు ఏమయ్యాయోనని ప్రశ్నిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల భద్రత, సంక్షేమం కోసం 1996లో అప్పటి ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ పథకం భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఉద్దేశించేవారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో అనేక మంది కులవృత్తుల వారిని ప్రభుత్వాలు చోటు కల్పించాయి. ఉపాధి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, చిన్నపాటి దుకాణాల్లో మెకానిక్‌లు, మరికొంత మంది వృత్తిదారులను సభ్యత్వం చేయిస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేసి, నిధులు లేకుండా చేయడంతో కార్మికులకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సభ్యత్వం నమోదు
చేతివృత్తులదారులు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు రెండు ఫొటోలు, ఆధార్ కార్డు జెరాక్స్, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ జెరాక్స్ కాపీలతో పాటు కార్మికుడిపై ఆధారపడి జీవించే వారి ఆధార్ కార్డు జెరాక్స్‌లు కార్మికశాఖ అధికారులకు అందజేయాలని, కార్మికశాఖ అధికారులు ఆన్‌లైన్‌ల్లో లబ్ధిదారులని పూర్తి వివరాలను నమోదు చేస్తారు. కార్మికశాఖ నుంచి ఒకసారి తీసుకున్న కార్డు 5 సంవత్సరాల వరకూ పనిచేస్తుంది. ప్రతి కార్మికుని నుంచి ఐదు సంవత్సరాల సభ్యత్వం కోసం రూ.60 బ్యాంక్‌లో ప్రభుత్వానికి చెల్లిస్తారు. గతంలో లేబరు కార్డు ఉన్న వ్యక్తులు మరలా రెన్యూవల్ చేసుకోవాలి.
రూ.100 కోట్ల హామీ అమలేదీ...
2014లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సంక్షేమ బోర్డుకు మంగళం పాడారు. కార్మికుల పోరాటాల కారణంగా కొత్తగా గత ఏడాది సంక్షేమ బోర్డును పునరుద్ధరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తి అవుతున్నా ఒక్క రూపాయి కూడా సంక్షేమ బోర్డు నుంచి లేబర్‌కార్డు తీసుకున్న కార్మికులకు చెల్లించలేదు. కార్మికులకు ప్రమాదాలు, మృత్యువాత పడినప్పుడు, ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడినా ఆర్థిక సాయం ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంక్షేమ బోర్డుకు రూ.100 కోట్లు ఇస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు చేయలేదు. బోర్డుకు చైర్మన్‌ను నియమించారు. కార్మిక సంఘాలతో పూర్తిస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయలేదు.


