రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాస్టర్ మృతి
కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చీడిపాలెం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన బోండ్ల వెంకటరావు (మోషే పాస్టర్) శనివారం తెల్లవారుజామున విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నుంచి తన స్వగ్రామానికి స్కూటీపై బయలుదేరారు. చింతలపూడి దాటిన తర్వాత ఆయన ప్రయాణిస్తున్న స్కూటీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో ఆయనను తొలుత రాజేంద్రపాలెం, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆయన మరణించారు. వెంకటరావుకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయ న భార్య రెండు కిడ్నీలు పాడైపోవడంతో, ఆయ నే స్వయంగా ఆమె ను డయాలసిస్‌కు తీసుకెళ్తూ అన్నీ తానై చూసుకునేవారు. ఇప్పుడు కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో అగాధమైన వేదనలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్.ఐ కిషోర్ వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బాధితులు అనుమానం వ్యక్తం చేయడంతో, పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.
సింగవరంలో విషాదం


