పెట్రోల్‌ బంకుల్లో జోరుగా ఆయిల్‌ కల్తీ | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల్లో జోరుగా ఆయిల్‌ కల్తీ

Mar 1 2026 7:45 AM | Updated on Mar 1 2026 7:45 AM

పెట్ర

పెట్రోల్‌ బంకుల్లో జోరుగా ఆయిల్‌ కల్తీ

● మరమ్మతులకు గురవుతున్న వాహనాలు ● కొలతల్లో రీడింగ్‌ మోసాలు ● పట్టించుకోని తనిఖీ శాఖలు ● పెట్రోల్‌ కల్తీపై వినియోగదారులు ఆగ్రహం

చోడవరం : అసలే ఆకాశాన్నంటిన ధర...ఆపై ఆయిల్‌ కల్తీ. నిఘా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పెట్రోల్‌ బంకుల్లో కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. ఇంధనం కల్తీ కారణంగా రూ.వేలు, లక్షలు పెట్టి కొనుగోలుచేసిన వాహనాలు మెకానిక్‌ షెడ్లకు చేరుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఆమాంతంగా ఆకాశాన్నంటడంతో వాహనాలపై హాయిగా తిరగడమే అందరికీ భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్‌ కల్తీ కూడా జరగుతుండడంతో మరమ్మతులకు గురైన వాహనాలకు పెట్టుబడులు పెట్టలేక వాహనచోదకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 100కు పైగా పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఉన్నాయి. చోడవరం పరిసరాల్లోనే 15 బంకులు ఉన్నాయి. వీటిలో ఆయిల్‌ కల్తీ ఎక్కువగా జరుగుతుంది. పెట్రోల్‌, డీజిల్‌లో ఇథనాల్‌, ఇతర క్రూడాయిల్‌ కల్తీకి పాల్పడుతున్నారు. ఆయిల్‌ కల్తీతోపాటు కొన్ని బంకుల్లో భూమిలో ఉంచిన స్టోరేజ్‌ ఆయిల్‌ ట్యాంకర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపునీరు పెట్రోల్‌, డీజిల్‌ ట్యాంకుల్లో చేరి ఆయిల్‌లో కలిసిపోతుండగా ఆ కల్తీ ఆయిల్‌నే వాహనాలకు వేస్తున్నారు. ఇటీవల పెట్రోల్‌ బంకుల్లో ఈ తరహా కల్తీతో అనేక వాహనాలు మరమ్మతులతో మూలకు చేరాయి. చోడవరం, వెంకన్నపాలెం, వడ్డాది, రావికమతం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం, యలమంచిలి, తాళ్లపాలెం, నర్సీపట్నం, పెందుర్తి ప్రాంతాల్లో బంకుల్లో ఆయిల్‌ కల్తీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బంకులను ఎప్పటికప్పుడు పరిశీలించి, తనిఖీలు చేయాల్సిన విజిలెన్స్‌, రెవిన్యూ,కొలతలు–తూనికలు, పౌరసరఫరాల శాఖాధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల కాలంలో ఈ శాఖల తనిఖీలు మొక్కుబడిగానే ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు లేకపోవడం వల్ల పెట్రోల్‌ బంకుల యజమానులు ఇష్టారాజ్యంగా ఆయిల్‌ కల్తీలకు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఆయిల్‌ వల్ల వాహనాల ఇంజిన్‌ స్ట్రక్‌ అయిపోయి మరమ్మతులతో వస్తున్నాయి. ఆయిల్‌ సాంద్రత (డెన్సిటీ)లో తేడాలు ఉండడం వల్ల కల్తీ ఆయిల్‌తో ఇంజన్లు దెబ్బతింటున్నాయి. కొలతల్లో భారీ మోసాలు చేస్తున్నారు. ముందుగా ఆయిల్‌ పంపింగ్‌ చేసే మిషన్ల వద్ద పాయింట్ల రీడింగ్‌లో ఎడ్జిస్టింగ్‌ చేస్తున్నారు. అసలే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.41 ఉండగా డీజిల్‌ ధర రూ. 98 ఉంది. ఇంత ఎక్కువగా ధరలు పెరిగిపోయిన పరిస్థితుల్లో రీడింగ్‌లో మోసాలు, ఆయిల్‌లో కల్తీలతో రూ.వేలకువేలు పోసి కొన్న వాహనాలు అర్ధంతరంగా మూలకు చేరడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతుంది. తక్షణం పెట్రోల్‌ బంకుల్లో ఆయిల్‌ కల్తీ, కొలతల్లో మోసాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని, కల్తీని అరికట్టాలని వాహదారులు కోరుతున్నారు.

పెట్రోల్‌ బంకుల్లో జోరుగా ఆయిల్‌ కల్తీ 1
1/1

పెట్రోల్‌ బంకుల్లో జోరుగా ఆయిల్‌ కల్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement