ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదా...
నియంతలా ఎంపీడీవో శ్రీనివాస్ వ్యవహారం
ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ,
సర్పంచులు వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆగ్రహం
కలెక్టరును స్వయంగా కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
నాతవరం: నిబంధనలు ఉల్లఘించి ప్రోటోకాల్ పాటించకుండా రాజకీయ పార్టీల మధ్య వివాదాలు సృష్టిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్ తీరుపై ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సభ్యులు సర్పంచులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలో శనివారం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి , వైస్ ఎంపీపీ పైల సునీల్, జెడ్పీటీసీ సభ్యులు కాపారపు అప్పలనర్స ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 16 మంది ఎంపీటీసీ సభ్యులు, 26 మంది పంచాయతీ సర్పంచులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీడీవో వ్యవహారశైలి కారణంగా నాతవరం ిపీహెచ్‌సీ ప్రాంగణంలో ఆట స్థలం వివాదం చోటు చేసుకుందన్నారు. ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ తీర్మానం లేకుండా ఏకపక్ష నిర్ణయంతో రూ.4 లక్షల నిధులతో ఆట స్ధలం పనులు ప్రారంభించి మధ్యలో నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. లింగంపేటలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం విషయంలో కూడా ఎంపీడీవో శ్రీనివాస్ సర్పంచులకు తెలియకుండా ఏక పక్ష నిర్ణయంతో భూమి పూజ చేసి గ్రామంలో వివాదానికి కారణమయ్యారన్నారు. మండల వ్యాప్తంగా ఏ పంచాయతీలోనైనా ప్రభుత్వ నిధులతో చేసే అభివృద్ధి పనులకు సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పదవులు లేని కూటమి నేతలతో పనులకు భూమి పూజ వంటి పనులు ఎంపీడీవో స్వయంగా చేయించడం జరుగుతుందన్నారు. మండలంలో 31 గ్రామ పంచాయతీలకు 26 గ్రామ పంచాయతీ సర్పంచులు వైఎస్సార్‌సీపీకి మద్దతుదారులే ఉన్నారన్నారు. కానీ పదవులు లేని కూటమి నేతలతో ఎంపీడీవో అభివృద్ధి పనులకు భూమి పూజలు చేయించి తమను అగౌరవ పరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారుగా రూ. 22 లక్షలు మార్చి 10లోపు ఖర్చు చేయాలని కలెక్టరు ఆదేశించారన్నారు. ఆయా నిధులతో పనులు చేసేందుకు గతంలో ఎంపీపీ లక్ష్మణమూర్తి స్వయంగా ప్రతిపాదనలు పంపించగా ఆ ఫైల్‌పై ఎంపీడీవో సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ఎంపీడీవో తీరుపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ మార్పు రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు లగుడు నాగేఽశ్వరరావు అద్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించి తీర్మానించామని, మాజీ గణేష్‌తో మండల నాయకులు చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గన్నవరం పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గొర్లె వరహాలబాబు, వైస్ ఎంపీపీ పైల సునీల్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కరక అప్పలరాజు, మంకు సాంబమూర్తి, వేమల సూరిబాబు, అడిగర్ల నాయుడు, కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్లు శిరుసుపల్లి నర్సింగరావు, పైల పోతురాజు, సర్పంచుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు మిరపల వెంకటరమణ, పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఇనపసప్పల పుష్ప, ఎంపీటీసీ సంఘం నాయకుడు తమరాన సత్యనారాయణ, మండల యూత్ అధ్యక్షుడు బండారు నాయుడు, సర్పంచులు గొలగాని రాణి, గుడపర్తి అచ్చియ్యనాయుడు, లగుడు నాగేశ్వరరావు, ఇట్టంశెట్టి శ్రీను, పాతాళ అప్పారావు, పార్టీ పెన్షనర్లు మండల శాఖ అధ్యక్షుడు సబ్బవరపు వెంకునాయుడు పాల్గొన్నారు.


