మెరుగైన విద్య, వైద్యంతోనే గిరిజనాభివృద్ధి
డుంబ్రిగుడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. అటవీ హక్కులు, భూమి హక్కుల పరిరక్షణతో పాటు మెరుగైన విద్య, వైద్యం అందించినప్పుడే గిరిజనాభివృద్ధి సాధ్యమని జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకుడు హేమంత్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని సాగర పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో ముఖాముఖిగా మాట్లాడి, వారికి అందుతున్న సదుపాయాలు, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా కమిటీ సభ్యులకు వివరించారు. అనంతరం, గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, భవిష్యత్తులో మరింత సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సాగర పంచాయితీ ఎంపీటీసీ, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వంతల దేవదాసు, ఐటీడీఏ పాడేరు కాఫీ ప్రాజెక్ట్ అధికారి (ఏడీ) బొంజునాయుడు, అటవీ రేంజ్ అధికారులు పాల్గొన్నారు.
జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకుడు హేమంత్ కుమార్


