వడ్డాది వెంకన్న కల్యాణోత్సవాలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

వడ్డాది వెంకన్న కల్యాణోత్సవాలకు వేళాయె..

Feb 27 2026 7:28 AM | Updated on Feb 27 2026 2:37 PM

-

నేటి నుంచి 5 రోజుల పాటు వేడుకలు 

ముస్తాబైన వడ్డాదిలో గిరిజాంబ కొండ 

స్వామివారి కల్యాణం నేడు 

150 మంది పోలీసులతో భారీ బందోబస్తు

బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి గిరిజాంబ కొండ ముస్తాబైంది. శుక్రవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే స్వామివారి కల్యాణ వేడుకలు తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వీరి సౌకర్యార్థం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 150 మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో దిగువ క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య సేవలు, తదితర ఏర్పాట్లు చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలకు, మెట్లు మార్గం, కళావేదిక తదితర ప్రాంతాల్లో రంగులు వేసి మిరుమిట్లు గొలుపే భారీ విద్యుత్‌ లైటింగ్‌ సెట్టింగ్‌లను కిలోమీటర్లు పొడవున ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవితో వేంకటేశ్వరస్వామి కల్యాణానికి మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ధ్వజ స్తంభం వద్ద, ఆలయంలోను, ఉత్సవ విగ్రహాల వద్ద భక్తులు తొక్కుసలాటలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కల్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు, నాయకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి రోజు రాత్రి 9 గంటలకు స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరగనుంది.

ఆలయ చరిత్ర..

42 ఏళ్ల క్రితం వడ్డాదికి నారాయణభజీ అనే స్వామి భిక్షాటనకు వచ్చి వడ్డాది పుణ్యక్షేత్రంగా భాసిల్లుతుందని చెప్పి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల్లోనే విజయరామరాజుపేటలో కాళ్ల పాకల వద్ద రైతులు నేలబావి తవ్వుతుండగా శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వరస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి గ్రామ పెద్ద దొండా భగవంతులయ్య ఆధ్వర్యంలో గిరిజాంబ కొండపై ఏర్పాటు చేసి ఆలయం నిర్మించారు. నిత్య ధూప, దీప నైవేద్యాలకు 58 ఎకరాల భూమిని ఆయన దానం చేశారు. అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు.

కల్యాణ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

స్వామివారి కల్యాణ మహోత్సవాలు జరిగే ఐదు రోజులు వడ్డాది కొండ దిగువ దేవస్థానం వారు, వడ్డాది నాల్గు రోడ్ల జంక్షన్‌లో వర్తక సంఘం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

వడ్డాది ఇలా చేరుకోవాలి..

స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రతి అరగంటకు నర్సీపట్నం, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ల నుంచి బస్సు సదుపాయం కలదు. విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు నుంచి వడ్డాదికి ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. మెట్ల మార్గంతోపాటు కొండపైకి వాహనాల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement