తూటిపాలలో ఇసుక తవ్వకాల అడ్డగింత
స్వాధీనం చేసుకున్న జేసీబీతో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది
మాకవరపాలెం: ఇసుక అక్రమ తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని తూటిపాల శివారులో సర్పానదిని ఆనుకున్న భూముల్లో ఇసుక తవ్వకాలకు స్థానికులు గురువారం జేసీబీతో ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే తహసీల్దార్ వెంకటరమణ తమ సిబ్బందితో తవ్వకాల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఇసుక తరలింపునకు రోడ్డు వేయడంతోపాటు మడుల్లో ఇసుకపై ఉన్న మట్టిని తొలగించే పనులు చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల రాకతో జేసీబీ డ్రైవర్ పరారయ్యాడు. జేసీబీని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వీఆర్‌ఏలను అక్కడే ఉంచామని తహసీల్దార్ తెలిపారు. ఆర్‌ఐ చక్రపాణి, వీఆర్వోలు పాల్గొన్నారు.


