స్పీకర్‌ ఇలాకాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ ఇలాకాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

స్పీక

స్పీకర్‌ ఇలాకాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

లింగంపేటలో కూటమి నేతల కక్ష సాధింపు

పూర్వం నుంచి నివాసం ఉంటున్న స్థలంలో పంచాయతీ భవనం నిర్మించేందుకు కుట్ర

హైకోర్టును ఆశ్రయించడంతో అధికారులతో తప్పుడు కేసులు

పోలీసులు ఏకపక్షంగా స్టేషన్‌కు తరలించారు

లింగంపేట సర్పంచ్‌ లోకవరపు రాము ధ్వజం

నాతవరం : అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అధికారులు అమలు చేస్తున్నారని లింగంపేట సర్పంచ్‌ లోకవరపు రాము అన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామంలో సర్వే నంబరు 46లో 15సెంట్ల విస్తీర్ణంలో లోకవరపు అప్పలనాయుడు కుటుంబ సభ్యులు పూర్వం నుంచి నివాసం ఉంటున్నారని, ఉమ్మడి కుటుంబీకులు ఆ స్థలాన్ని వాటాలు వేసుకుని కొందరు శ్లాబు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు ఆ స్థలంలో షెడ్లు వేసుకుని ఉంటున్నారన్నారు. వీరంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారు కావడంతో ఈ స్థలం గ్రామ కంఠం అంటూ కూటమి పెద్దలు కుట్ర చేశారన్నారు. ఈ స్థలంలో పంచాయతీ భవనం నిర్మిస్తామంటూ స్థానిక కూటమి నేతలు ప్రతిపాదనలు చేశారని, అధికారుల అండతో సర్పంచ్‌నునైన తనకు తెలియకుండా ఆ స్థలంలో పంచాయతీ నూతన భవనం నిర్మాణం చేసేందుకు రెండు నెలల క్రితం భూమి పూజ చేశారని తెలిపారు. పూర్వం నుంచి నివాసం ఉంటున్న వారి స్థలంలో భవనం నిర్మాణం చేయొద్దని, తనకు తెలియకుండా భూమి పూజ ఎలా చేస్తారని అధికారులను అడిగామన్నారు. కానీ అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా కూటమి నేతలకు వత్తాసు పలకడంతో ఈ స్థలంలో నివాసం ఉంటున్న లోకవరపు అప్పలనాయుడు, మనోజ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చిందన్నారు. స్టే ఉండగా ఆ స్థలంలో ఎంపీడీవో శ్రీనివాస్‌ పోలీసు బందోబస్తుతో పనులు చేసేందుకు గత నెలలో సిద్ధమయ్యారని చెప్పారు. తాను బాధితులతో కలిసి ఆ స్థలంలో పనులు చేయకుండా నిలుపుదల చేశానన్నారు. దీనిపై కక్ష పెట్టుకున్న అధికారులు, కూటమి నేతలు కుమ్మకై ్క పంచాయతీ కార్యదర్శి బాబితో లోకవరపు వరహాలబాబు, యర్రాపాత్రుడు నూకరాజు, మంగ నారాయణమూర్తి తదితర వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయించారని తెలిపారు.

పోలీసులు క్షేత్ర స్థాయిలో జరిగిన విషయాలు పరిశీలించకుండా సోమవారం రాత్రి బాధితులనే నాతవరం తీసుకెళ్లిపోయారన్నారు. తప్పుడు కేసులు పెట్టి స్టేషన్‌కు తరలించి, ఆ స్థలంలో పోలీసులు బందోబస్తుతో మంగళవారం పనులు చేసేందుకు ఎంపీడీవో శ్రీనివాస్‌ తహసీల్దార్‌ ఓ.చందనరేఖ వచ్చారన్నారు. ఈ స్థలంలో ఎలాంటి పనులు చేయరాదని కోర్టులో స్టే ఉందని అధికారులతో వాదించామన్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా, సర్పంచ్‌కు తెలియకుండా ఏకపక్ష నిర్ణయంతో పంచాయతీ భవనం నిర్మాణం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై తప్పుడు కేసులు పెట్టి, భయపెట్టి కూటమి నేతలు అధికారుల అండతో ఇష్టానుసారం చేసేందుకు కుట్ర చేశారని సర్పంచ్‌ రాము ఆరోపించారు.

టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమ అరెస్ట్‌లు

నర్సీపట్నం: టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని నాతవరం మండలం, లింగంపేట సర్పంచ్‌ లోకవరపు రాము ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన స్థలం విషయంలో పోలీసులు వ్యవహారించిన తీరుపై ఆర్డీవో కార్యాలయంలో సర్పంచ్‌, బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం సర్పంచ్‌, బాధిత కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తాత,తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన 15 సెంట్ల భూమిని లోకవరపు వరహాలబాబు, రాజుబాబు అనుభవిస్తున్నారన్నారు. ఈ భూమిపై గ్రామ టీడీపీ నాయకుడు డి.అప్పలనాయుడు కన్నేశాడరన్నారు. ఆ భూమి గ్రామకంఠం పరిధిలో ఉందని రూ.2 లక్షలు ఇవ్వాలని అప్పలనాయుడు అనుభవదారులను డిమాండ్‌ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆస్థలంలో పంచాయతీ భవనం కడతామని టీడీపీ నాయకుడు అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారన్నారు.ఆ స్థలంలో భవనం కట్టేందుకు చేసిన తీర్మానంపై తన సంతకాలను సైతం పోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ నెల 23వ తేదీ రాత్రి భోజనం చేస్తున్న మా కుటుంబ సభ్యులైన లోకవరపు నూకరాజు, లోకవరపు మంగ, లోకవరపు కొండబాబు, లోకవరపు నారాయణమూర్తి, పైల సీతారామనాగ జమీలు, లోకవరపు వరహాలబాబును పోలీసులు తీసుకెళ్లారని, ఎందుకు తీసుకువెళ్తున్నారని ఎస్‌ఐ తారకేశ్వరరావును ప్రశ్నించినప్పటికీ సమాధానం లేదన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్రమ అరెస్టులు చేశారన్నారు. స్థల విషయమై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

స్పీకర్‌ ఇలాకాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం 1
1/1

స్పీకర్‌ ఇలాకాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement