సచివాలయ ఉద్యోగి అని నమ్మించి బంగారం చోరీ
నిందితుడి అరెస్టు
అనకాపల్లి : సచివాలయ ఉద్యోగిగా చెప్పుకుని జిల్లాలో పలు చోట్ల చోరీకి పాల్పడిన కోనసీమ జిల్లా, రాజోలు మండలం, శివకోడపాలెం గ్రామానికి చెందిన ఎల్లమెల్లి వెంకటరమణ, అలియాస్ కిషోర్, అలియాస్ అర్జునరావును అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఎం. శ్రావణి అన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు వెంకటరమణ గత ఏడాది డిసెంబర్‌లో అనకాపల్లి పట్టణం కర్ణాలువీధి దగ్గర సచివాలయం ఉద్యోగిని అని చెప్పి ఒక గృహాన్ని అద్దెకు కావాలని చెబుతూ పింఛన్ ఇప్పిస్తానని, ఫొటో, ఫింగర్ ప్రింట్ తీసుకోవాలని నమ్మబలికి మెడలో బంగారం తాడు ఉంటే పింఛను రాదని, ఆ బంగారాన్ని తీసివ్వమని చెప్పి ఓ మహిళను మోసగించాడని తెలిపారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు గ్రామంలో కూడా ఇదే విధంగా తనను తాను సచివాలయ ఉద్యోగిగా చెబుతూ ప్రభుత్వం నుంచి కొత్త పథకం కింద కొంత నగదు వచ్చిందని, ఆ డబ్బులు ఇవ్వాలంటే ఆధార్‌కార్డు, ఫొటో కావాలని, మెడలో బంగారు వస్తువులు తీయించి కాజేశాడని డీఎస్పీ చెప్పారు. నిందితుడు వద్ద నుంచి చోరీ సొత్తు 33.21 గ్రాములు బంగారం తాడు, రెండు బంగారం సూత్రాలు 22.85 గ్రాములు, ఒక బంగారం నల్లపూసలు 31.70 గ్రాములు మొత్తం బంగారం సుమారుగా 87.70 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందన్నారు. నిందితుడిపై రాష్ట్రంలో పలు పోలీస్‌స్టేషన్లలో పాత కేసులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్‌ఐలు అల్లు స్వామినాయుడు, కె.సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.


