గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకలను క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసు దళాల గౌరవ వందనం, శకటాల ప్రదర్శన, ప్రభుత్వ పథకాలు ప్రతిబింభించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు.దేశభక్తిని వాటి చెప్పేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించాలని సూచించారు. అవార్డుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. అత్యవసర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్య సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఈనెల 25న జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయిల్లో ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా చేర్పించాలని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్‌చార్జి డీఆర్వో అంబేడ్కర్, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్ పడాల్, పరిశ్రమ శాఖ అధికారి రమణరావు, డీఆర్డీఏ పీడీ మురళి, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
31వ తేదీ వరకు ఉచిత పశువైద్య శిబిరాలు
జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 31 వరకు ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఉచిత పశువైద్య శిబిరాల పోస్టర్లను సోమవారం ఆయన తన కార్యాలయంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం, పశువుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశువులు, మేకలు, గొర్రెలు, మూగజీవాలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు, గర్భకోశ వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, పాడి పశువుల శాసీ్త్రయ యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు చెప్పారు. పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.బి.ఎస్. నందు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు కరుణకర్‌రావు, జయరాం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.


