గిరిజనులకు తప్పని డోలీమోత కష్టాలు
పెదబయలు: అత్యవసర పరిస్థితుల్లో ఊరు దాటాలంటే డోలీమోతలు తప్పడం లేదు. సరైన రోడ్డు సదుపాయంలేక రాకపోకలకు అవస్థలకు గురికావలసి వస్తోంది. మరో వైపు అంబులెన్స్ కోసం పోన్ చేసినా గంటల తర బడి నిరీక్షించిన తరువాతే వస్తున్నాయి. బొంగరం పంచాయతీ వంచుర్భ గ్రామం చెంగెరెడ్డి వీధికి చెందిన పోయిభ రాములమ్మ మూడు రోజుల నుంచి గొంతు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోంది. నీరు కూడా తాగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు భర్త సత్తిబాబు 108 వాహనం కోసం ఫోన్ చేశారు. జి.మాడుగు ల, పాడేరు, ముంచంగిపుట్టు, పెదబయలు 108 వాహ నాలు ఖాళీగా లేవని సమాధానం వచ్చింది. దీంతో పాడేరు ఐటీడీఏ టోల్ ఫ్రీ నంబర్‌కు పోన్ చేస్తే గోమంగి పీహెచ్‌సీ అంబులెన్స్ డ్రైవర్‌కు కాల్ కలిపారు. తాను గుల్లేలు పంచాయతీ రెంజలమామిడి లో మరో సీరియస్ కేసును తరలిస్తున్నాని ఆయన చెప్పాడు. ఎలాగైన రావా లని కోరడంతో వంచుర్భ గ్రామం వరకూ వచ్చాడు. డోలీలో చెంగెరెడ్డి వీధినుంచి రెండు కిలో మీటర్లు రాములమ్మను తరలించి అంబులెన్స్‌లో ఎక్కించి గోమంగి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.అంబులెన్స్ కోసం రెండు గంటల పాటు ప్రయత్నం చేస్తే గానీ గ్రామానికి వచ్చే పరిస్థితి లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.


