లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు మూడు లక్షలకు పైగా ఉన్నా
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో వేర్వేరు బ్యాంకు అకౌంట్లలో కోట్ల రూపాయలు మగ్గిపోతున్నాయి. వివిధ బ్యాంకుల్లో పదేళ్లకు పైగా లావాదేవీలు జరగని ఖాతాలు లక్షల్లో ఉన్నాయి. జిల్లాలో ఉన్న వివిధ బ్యాంకుల్లో 3,32,251 ఖాతాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని అధికారులు గుర్తించారు. ఆయా ఖాతాల్లో రూ.57.20 కోట్ల నగదు మూలుగుతోంది. ఈ మొత్తాన్ని సంబంధిత వ్యక్తులు తిరిగి పొందేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించింది.
లావాదేవీలు నిర్వహించని ఖాతాల్లో వ్యక్తిగత, ప్రభుత్వ, వివిధ సంస్థల ఖాతాలు ఉన్నాయి. దీని కోసం ’మీ డబ్బు–మీ హక్కు’ పేరుతో ఈ నెల 21న అనకాపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తోంది. అంతేకాకుండా జిల్లాలో ఉన్న వివిధ జాతీయ బ్యాంకుల అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
కారణాలెన్నో..
● జిల్లాలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఖాతాలు ఉన్నాయి. ఖాతాదారులు మృతి చెందడం.. దీర్ఘకాలిక పెట్టుబడుల కింద వీటిని ఉంచడం.. బ్యాంకుల్లో నగదుకు గ్యారెంటీ ఉంటుందన్న ధీమాతో అలానే వదిలేయడం ఇందుకు కారణాలు
● ఖాతా తెరిచినప్పుడు నామినీ వివరాలు నమోదు చేయకపోవడంతో ఖాతాదారు మరణించిన సందర్భంలో ఆ మొత్తం ఎవరికీ రాకుండా అలాగే ఉండిపోతుంది.
● బ్యాంకులో నగదు జమ చేసి అకాల మృత్యువాత పడటం.. ఆ వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవడం మరో కారణం. సరైన పత్రాలు లేకపోవడం, చిరునామాల్లో తప్పులు దొర్లడం లాంటి వాటితో నిల్వలు పేరుకుపోయాయి.
ఇలా పొందవచ్చు.. :
● ఖాతాల్లో డబ్బులను సంబంధిత ఖాతాదారులు అసలైన ధ్రువపత్రాలు సమర్పించి తీసుకోవచ్చు.
● ఖాతాదారులు చనిపోతే వారికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం చూపి, కుటుంబసభ్యుల అంగీకార పత్రాన్ని తీసుకెళ్లి నామినీలు డబ్బు తీసుకునే సదుపాయం కల్పించారు.
● ఖాతాదారుడు ఉంటే సంబంధించిన పత్రాలు తీసుకెళ్లి ఈకేవైసీ చేయించుకోవడం ద్వారా ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు.
ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్నబ్యాంక్ అధికారులు
మీ డబ్బు.. మీ హక్కు
మీ బ్యాంక్ ఖాతాల్లో ఉండిపోయిన డబ్బులను తిరిగి ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ సిద్ధంగా ఉంది. పదేళ్లు.. అంతకన్నా ఎక్కువ కాలంపాటు లావాదేవీలు జరగకుండా నిలిచిపోయిన సొమ్మును తగిన ఆధారాలు చూపితే ఇచ్చేస్తాం. ఎక్కువగా వ్యక్తిగత ఖాతాలు, న్యాయపరమైన చిక్కులున్న ప్రభుత్వ శాఖల ఖాతాల్లో డబ్బులు ఉండిపోయాయి. వీటి కోసం శుక్రవారం ఏర్పాటు చేస్తున్న శిబిరానికి వచ్చి పాత నిల్వలను బ్యాంక్ నుంచి తీసుకోవాలని కోరుతున్నాం.
– సత్యనారాయణ,
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్
పదేళ్లకు మించి బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు జరగని సొమ్ము
ఇచ్చేందుకు అవకాశం
సరైన పత్రాలు తీసుకొచ్చి సొమ్ము
తీసుకెళ్లాలంటున్న ఆర్బీఐ అధికారులు
నేడు అనకాపల్లిలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు
జిల్లాలో 3,32,251 ఖాతాల గుర్తింపు.. వాటి నిల్వ రూ.57.20 కోట్లు
లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు మూడు లక్షలకు పైగా ఉన్నా
లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు మూడు లక్షలకు పైగా ఉన్నా


