చెట్టు కొమ్మ విరిగిపడి గిరిజనుడు మృతి
రాజవొమ్మంగి: మండలంలోని చికిలింత గ్రామానికి చెందిన బండారు రమణ అనే గిరిజనుడు గురువారం కట్టెల కోసం కొండకు వెళ్లగా చెట్టు కొమ్మ విరిగి మెడ, తలపై పడింది. దీంతో రమణ (54) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని అడ్డతీగల ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు జడ్డంగి ఏఎస్‌ఐ విజయకుమార్ విలేకరులకు తెలిపారు. రమణ మృతితో భార్య చిన్నబుల్లి, కుమార్తె హర్షిత, కుమారుడు శ్రీను దిక్కులేని వారయ్యారని గ్రామస్తులు చెప్పారు. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


