సెల్లార్‌లో మంటలు.. జిమ్‌లో పొగలు
ఇసుకతోటలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం
లిఫ్ట్ ద్వారా నాలుగు అంతస్తుకు వ్యాపించిన మంటలు
వ్యాయామం చేస్తున్న 25 మంది యువకుల క్షేమం
15 బైకులు, ఆటోలు దగ్ధం.. పాడైన కార్లు
మద్దిలపాలెం: ఆరోగ్యం కోసం జిమ్‌కు వెళ్లిన ఆ యువతకు ఊహించని అనుభవం ఎదురైంది. శరీరాన్ని దృఢంగా మార్చుకునేందుకు వెళ్తే.. అక్కడే ఊపిరి ఆగిపోయేంత ప్రమాదం ముంచుకొచ్చింది. గురువారం తెల్లవారుజామున ఇసుకతోటలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్‌లో రగిలిన మంటలు నాలుగో అంతస్తులోని జిమ్‌ను దట్టమైన పొగలతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో, అందులో ఉన్న 25 మంది యువకులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రేఖయ్య, అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి వరప్రసాద్ అందించిన వివరాలివి.
ఆహ్లాదకరమైన ఉదయం.. అంతలోనే ఆందోళన
రోజూలాగే ఉదయం 6 గంటలకు యువకులు ఇసుకతోట మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని జిమ్‌కు చేరుకుని.. ఉల్లాసంగా కసరత్తులు చేస్తున్నారు. సుమారు 7 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా లిఫ్ట్ మార్గం గుండా దట్టమైన నల్లని పొగలు జిమ్‌లోకి చొరబడ్డాయి. మొదట ఏంటో తెలియక తికమక పడ్డారు. కానీ క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా పొగ కమ్మేయడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. తప్పించుకునే దారిలేక జిమ్‌లోనే చిక్కుకుపోయారు. భవనం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. జిమ్‌లో ఉన్న యువకులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అసిస్టెంట్ అగ్నిమాపక అధికారి వరప్రసాద్ బృందం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. అతని సూచనల మేరకు యువకులు జిమ్ కిటికీల అద్దాలను బద్దలు కొట్టారు. ఆ తర్వాత గాలి లోపలికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అద్దాలు పగులగొట్టే శబ్దాలు, సహాయం కోసం యువకుల అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది నాలుగో అంతస్తుకు చేరుకుని, మెట్ల మార్గం ద్వారా ఒక్కొక్కరినీ క్షేమంగా కిందకు తీసుకువచ్చారు. అసలు ప్రమాదానికి కేంద్రం భవనంలోని సెల్లార్‌గా గుర్తించారు. అక్కడ కుప్పలుగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు గంటల పాటు 8 ఫైర్ ఇంజన్లతో 35 సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సెల్లార్‌లో పార్క్ చేసిన 15 బైకులు, ఆటోలు దగ్ధమయ్యాయి. ఐదు కార్లు పాడయ్యాయి. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామని జిల్లా అగ్ని మాపకశాఖాధికారి తెలిపారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సెల్లార్‌లో మంటలు.. జిమ్‌లో పొగలు


