
1/70 చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని వినతి
ఎటపాక: మండలంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను గురువారం తహసీల్దార్ కారం సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మండలంలో గిరిజనేతరుల ఆక్రమణలు తొలగించి భూకబ్జాలను అరికట్టాలని అన్నారు. ఆదివాసీల భూములు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన, వ్యవసాయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎటపాక, లక్ష్మీదేవిపేట, మేడువాయి, రాయనపేట, పురుషోత్తపట్నం, నెల్లిపాక, లక్ష్మీపురం, బాసవాగు, పాలమడుగు, రామగోపాలపురం, గన్నవరం, గౌరిదేవిపేట తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములు కబ్జా చేసి గిరిజనేతరులు వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. పలుచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తున్నారని, అలాంటి వాటిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.