
ఆర్టీసీ బస్సు, జీపు ఢీ– ఇద్దరికి స్వల్ప గాయాలు
జి.మాడుగుల: చింతపల్లి రోడ్డు మార్గంలో కొక్కిరాపల్లి ఘాట్ రోడ్డులో మలుపు వద్ద ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు, జీపు ఢీ కొన్నాయి. ఈ ప్రమాద సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గురువారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు చింతపల్లి నుంచి జి.మాడుగుల మీదుగా పాడేరు వైపు వస్తుండగా, జి.మాడుగుల నుంచి ప్రయాణికులతో చింతపల్లి వైపు వెళ్తున్న జీపు కొక్కిరాపల్లి ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పగాయాలైనట్టు స్థానికులు తెలిపారు. జీపు కొంతభాగం, ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతిన్నట్టు చెప్పారు. గాయపడిన వారిని చింతపల్లి ఆస్పత్రికి తరలించినట్టు వారు చెప్పారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.