
డీఎల్‌ఎస్‌సీలో విచారణకు నోచుకోని కేసులు
● ఇరవై ఏళ్లు గడుస్తున్నా ఇదే పరిస్థితి
● వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు
గొర్లె నారాయణ ఆరోపణ
రంపచోడవరం: రంపచోడవరం డివిజన్ పరిధిలో ఉన్న వాల్మీకి (ఎస్టీ) తెగకు చెందిన డీఎల్‌ఎస్‌సీలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ విచారణ పూర్తి చేయలేదని జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు గొర్లె సీహెచ్ నారాయణ ఆరోపించారు. రంపచోడవరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవో ఎంఎస్ నెం.58 ప్రకారం 45 రోజుల్లో పూర్తి చేయాల్సిన విచారణ ఇరవై ఏళ్లయినా ముందుకు వెళ్లని పరిస్థితి ఉందన్నారు. ఈ విషయమై కలెక్టర్‌ను జనవరి నెలలో కలిసి ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. రెండు నెలల వ్యవధిలో డీఎల్‌ఎస్‌సీలో కేసుల విచారణ పూర్తి చేసి పంపమని రంపచోడవరం ఐటీడీఏ పీవోకు చెప్పారని తెలిపారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో పనిచేసిన ఐటీడీఏ పీవో గిరిజనుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపేవారన్నారు. ప్రస్తుత పీవో కూడా అదేవిధంగా వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. కింది స్ధాయి అధికారులకు తప్పుడు సంకేతాలు ఇస్తూ వాల్మీకి తెగపై వివక్ష చూపడం తగదన్నారు. దీని వలన చాలామంది విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగంతోపాటు సామాన్య ప్రజలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారన్నారు. ప్రస్తుతం కులధ్రువీకరణ పత్రాలు లేని ఎస్టీల గురించి విచారణ చేసి ప్రభుత్వం జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కూడా వాల్మీకి తెగవారికి సర్టిఫికెట్ తిరస్కరించాలని పీవో మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. దీనిని బట్టి స్థానిక తహసీల్దార్లకు, కింది స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారమన్నారు. పూర్తి స్థాయిలో విచారణ లేకుండా కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం వలన చాలా మంది నకిలీలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అధికారులు వాల్మీకి తెగ వారికి కూడా సమాన న్యాయం చేయాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం స్టీరింగ్ కమిటీ సభ్యుడు వి.సత్యనారాయణ పాల్గొన్నారు.