
బురదలోకూరుకుపోయిన బస్సు
సీలేరు: డొంకరాయి నుంచి సీలేరు మీదుగా పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మరమ్మత్తుతో సీలేరు సమీప వలసగెడ్డ దగ్గర నిలిచిపోయింది. ఆ బస్సును తప్పించబోయి మరో బస్సు బురదలో కూరుకుపోయిన సంఘటన బుధవారం జరిగింది. అయితే భద్రాచలం నుంచి విశాఖ వెళ్తున్న బస్సు నిలిచి ఉన్న పాడేరు బస్సును తప్పించబోయి బురదలో కూరుకుపోయింది. దీంతో సుమారు గంటపాటు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు ప్రయాణికులు సుమారు అరగంట పాటు శ్రమించి బురదలో కూరుకుపోయిన బస్సును బయటకు తీశారు. బస్సు సుమారు గంటన్నర తరువాత బయలుదేరింది.
విచారణ కమిటీ నియామకం
రంపచోడవరం: రంపచోడవరం వైటీసీలో ఈ నెల 22న జరిగిన ఆదికర్మ యోగి అభియాన్ శిక్షణలో జరిగిన వివిధ అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైటీసీలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు, సచివాలయ సిబ్బందితో ఆదికర్మయోగి అభియాన్‌పై ఈనెల 22న ఓ కార్యక్ర మం జరిగింది. ఇందులో నృత్యాలు, ఇతరత్రా సాంస్కృతి కార్యక్రమాలు జరిగినట్టు పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్, ఏఓ సావిత్రిలతో విచారణ కమిటీ నియమించినట్టు తెలిపారు.