
వరదనీటిలో చిక్కుకున్న లారీ
మూడు రోజుల్లో మళ్లీ ముంచేసిన వైనం
ప్రస్తుతానికి తగ్గుముఖం, మళ్లీ పెరిగే అవకాశం
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
చింతూరు: వరద తగ్గు ముఖం పట్టి విలీన మండలాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్న దశలో.. శబరినదికి ఆకస్మికంగా వరద పెరిగి భయాందోళన కలిగించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలోనే ఎగువనున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆకస్మికంగా వరద పెరిగింది. మంగళవారం రాత్రి వరకు ప్రశాంతంగా ఉన్న శబరినది బుధవారం ఉదయానికల్లా చింతూరు వద్ద ఒక్కసారిగా పెరిగింది.
శబరి నది ఉధృతికి మండలంలోని కుయిగూరు, సోకిలేరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగులు పొంగి వరదనీరు రహదారులపైకి చేరింది. కుయిగూరువాగు వరద జాతీయ రహదారి–326పై చేరడంతో ఆంధ్ర, ఒడిశా నడుమ బుధవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశా నుంచి ఆంధ్రాకు ఐరన్‌లోడుతో వస్తున్న ఓ లారీ వరదనీటిలో చిక్కుకుంది.
ఈ వరద కారణంగా మండలంలోని కుయిగూరు, కల్లేరు, మదుగూరు, సూరన్నగొంది గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. సోకిలేరు, చీకటివాగుల వరద కారణంగా చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య కూడా బుధవారం ఉదయం నుంచి అదే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు చింతూరు మండలంలోని నర్శింగపేట, ముకునూరు, రామన్నపాలెం, చినసీతనపల్లి, బొడ్రాయిగూడెం, కొండపల్లి, పెదశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు నాటు పడవలపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. మరోవైపు శబరినది ఉధృతికి కుయిగూరువాగు ఆకస్మికంగా పెరిగి వరదనీరు చింతూరును చుట్టుముట్టడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కాగా గురువారం ఉదయం నుంచి వరద తగ్గుతుండడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
పెరుగుతున్న గోదావరి
ఓ వైపు శబరినది తగ్గుతుండగా తెలంగాణ నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నది క్రమేపీ పెరుగుతోంది. దీంతో కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముంది. గురువారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39 అడుగులుండగా, కూనవరంలో 36 అడుగులకు చేరుకుంది. దీంతో కూనవరం మండలంలో కొండ్రాజుపేట కాజ్‌వేపై వరదనీరు చేరి 8 గ్రామాలకు రవాణా స్తంభించింది. వీఆర్‌పురం మండలంలో రామవరం, చింతరేగుపల్లి, తుష్టివారిగూడెం వద్ద వరదనీరు రహదారిపై చేరడంతో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అప్రమత్తంగా ఉండాలి: పీవో శుభం నొఖ్వాల్
శబరినది వరద తగ్గుముఖం పట్టినా గోదావరి మళ్లీ పెరిగే అవకాశమున్నందున లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. ప్రస్తుతానికి చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో ఆరు ప్రాంతాల్లో రహదారులు ముంపునకు గురైనట్లు ఆయన తెలిపారు. వరద పెరిగి గ్రామాల్లోకి నీరు చేరితే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని, గురువారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45 అడుగులకు చేరే అవకాశముందని ఆయన తెలిపారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులకు నిత్యావసర సరకులు అందచేస్తామని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు లాంచీలు, నాటుపడవలు సిద్ధంగా ఉంచినట్లు పీవో తెలిపారు.

ఆంధ్ర-ఒడిశా జాతీయ రహదారిపై నిలిచివున్న వరద నీరు

నాటుపడవపై సోకిలేరు వాగు దాటుతున్న ప్రజలు