
హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దంటూ గర్జించిన గిరిజనం
హుకుంపేట: భూర్జ పంచాయతీలో ఏర్పాటు చేయతలపెట్టిన హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దంటూ ఆదివాసీ గిరిజనులు నినదించారు. ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. భూర్జలో గురువారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ గర్జన పేరుతో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణం వలన గిరిజనులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న పీసా చట్టం, అటవీ హక్కుల 1/70 చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ప్రాజెక్టుల నిర్మాణానికి వేల ఎకరాలు అటవీ, జిరాయితీ భూములు కేటాయించడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టు వలన ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 5 వేల మంది గిరిజనులు నష్టపోతారని, ఈ ప్రాజెక్టు నిర్మాణం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేయొద్దని పంచాయతీలోని 14 గ్రామాల గిరిజనులు తీర్మానం చేసుకున్నారు. జెడ్పీటీసీ గంగరాజు మాట్లాడారు. గిరిజన సంఘం నాయకులు పి.బలదేవ్, తాపుల కృష్ణారావు, స్థానిక సర్పంచ్ కె.మొత్తి, ఎంపీటీసీ మజ్జి హరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భూర్జలో భారీ ర్యాలీ