
ముంపులో ‘ముంచంగిపుట్టు’
● మండలంలో పొంగిన వాగులు,
పారు గెడ్డలు
● 40 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ముంచంగిపుట్టు: మండలంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, పారు గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదర్, తుమిడిపుట్టు, ఉబ్బెంగుల, దొరగూడ, మెట్టగూడ, దొడిపుట్టు పంచాయతీ బిడిచంప, రాంపుట్టు గ్రామాల సమీపంలో వాగులు వరదనీటితో ఉధృతంగా ప్రవహించడంతో ఆయా గ్రామాల గిరిజనులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. నిత్యావసర సరకులు, అత్యవసర పనుల నిమిత్తం ప్రాణాలకు తెగించి, వాగును దాటుకొని మండల కేంద్రానికి వచ్చి, తిరిగి అదే అవస్థలు పడుతూ గ్రామాలకు చేరుకుంటున్నారు. బరడ పంచాయతీ సొలగంపుట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో కల్వర్టు వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వనుగుమ్మ పంచాయతీ తర్లగూడ, బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మి గ్రామాల సమీపంలో పారు గెడ్డలు వర్షపు నీటితో ప్రవహిస్తుండడంతో రాకపోకలకు రెండు గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూసిపుట్టు, రంగబయలు, కుమడ పంచాయతీల్లో అనేక గ్రామాలకు వెళ్లే మార్గాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 40 గ్రామాల రాకపోకలకు విఘాతం కలిగింది. పంట పొలాలు సైతం అనేక గ్రామాల్లో నీటమునిగాయి. పంటలు పాడైపోవడంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపురం పంచాయతీ జభభడ, బూసిపుట్టు పంచాయతీ కేంద్రం, బుంగాపుట్టు పంచాయతీ రంగినిగూడ గ్రామాల్లో మూడు ఇళ్లు కూలి, గిరిజనులు నిరాశ్రయులయ్యారు.

ముంపులో ‘ముంచంగిపుట్టు’