
డుడుమ, జోలాపుట్టు జలాశయాలకుభారీగా వరద నీరు
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో భారీగా వరద నీరు చేరింది. జలాశయాలు పూర్తిగా నిండిపోయి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. జలాశయాల గేట్లపై నుంచి నీరు వెళ్లిపోతుండడంతో జలాశయాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. డుడుమ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,590 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 2587.30 అడుగులుగా నమోదయింది. దీంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది మూడు గేట్లను పైకెత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయం ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయ నీటిమట్టం సైతం ప్రమాద స్థాయికి చేరుకుంది. జోలాపుట్టు జలాశయ నీటి సామర్ధ్యం 2750 అడుగులు కాగా గురువారం రాత్రి 7 గంటలకు 2748.30 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది జోలాపుట్టు జలాశయం నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

డుడుమ, జోలాపుట్టు జలాశయాలకుభారీగా వరద నీరు