
మూడోసారి ముంపునకు గురైన కాజ్‌వే
కూనవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శబరి, గోదావరి నదులకు మళ్లీ వరద పోటెత్తింది. దీంతో కొండ్రాజుపేట కాజ్‌వే పైకి మూడోసారి వరదనీరు చేరి కూనవరం, టేకులబోరు నుంచి కొండ్రాజుపేట, వాల్‌ఫర్డ్ పేట, శబరికొత్తగూడెం, పూసుగ్గూడెం, వెంకన్నగూడెం, శ్రీరామ్‌పురం, కొత్తూరు, ఆంబోతుల గూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్‌వే పరీవాహక ప్రాంత పొలాలన్నీ నీటమునిగాయి. క్రమక్రమంగా వరద పెరుగుతుండంతో ప్రమాదపుటంచున ఉన్న శబరికొత్తగూడెం గ్రామాన్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు గోదావరి ఉధృతిపై అవగాహన కల్పించారు. కాజ్‌వే పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని కాపలా ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. కాగా కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం సాయంత్రం 7 గంటలకు 37 అడుగులు నమోదైందన్నారు. ఎంఆర్‌ఐ జల్లి సత్యనారాయణ, వీఆర్వో విజయకుమారి, కుంజా శ్రీను తదితరులు పాల్గొన్నారు.