
డోలీలో గర్భిణి తరలింపు
● ఆదివాసీలకు
తప్పని తిప్పలు
చింతపల్లి: ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. బలపం పంచాయతీ మారుమూల కుడుములు–సుర్తిపల్లి గ్రామానికి చెందిన గర్భవతి కాకూరి కుమారికి సుస్తీ చేయడంతో ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. దాంతో భర్త కాకూరి సురేష్.. కుటుంబ సభ్యులు, ఆఽశా వర్కర్ వరహాలమ్మ సహాయంతో డోలిలో నాలుగు కిలోమీటర్లు ఆమెను మోసుకొని వచ్చి, అక్కడినుంచి అంబులెన్సులో కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరిలించారు. అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు జరిపి ఉన్నత వైద్యానికి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దాంతో ఆమెను చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. చింతపల్లిలో వైద్యులు పరీక్షలు జరిపి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.