
ఏటేటా పెరిగే కార్యసిద్ధి గణపతి
చోడవరం క్షేత్రంలో 300 ఏళ్ల నాటి స్వయంభూ విఘ్నేశుడు
చోడవరం: చోడవరం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని తూర్పుదిశగా ఉన్న శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం ఉంది. సుమారు 300 ఏళ్లనాటి చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహం నడుము పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. స్వామివారి తొండం చివరిభాగం పైకి కనిపించదు. ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందనే ప్రతీతి ఉంది. పాతచెరువు ఒడ్డున ఉన్న ఈ స్వయంభూ వినాయకుని విగ్రహాన్ని పక్కనే ఉన్న శ్రీ స్వయంభూ గౌరీశ్వరాలయంలోకి తరలించడానికి అప్పట్లో తవ్వకాలు జరిపించగా ఎంతపొడవు తవ్వినా స్వామివారి తొండం చివరి భాగం కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు పూర్వీకులు చెబుతారు. తవ్వకాన్ని జరిపిన ప్రాంతాన్ని ‘ఏనుగుబోదె’గా పిలుస్తుంటారు. ఒకనాడు జీర్ణావస్థలో ఉన్న ఈ స్వయంభూ విఘ్నేశ్వరాలయాన్ని 1856లో చుండూరు వెంకన్న పంతులు ఆధ్వర్యంలో కొడమంచిలి చలపతిరావు అర్చకత్వంలో పునఃసంప్రోక్షణ జరిపారు. 1875లో కొడమంచిలి గణేష్, పలువురు కలసి స్థాపించిన శ్రీ బాలగణపతి సంఘం సహకారంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేపట్టారు. దేవదాయ ధర్మదాయశాఖ ఆధీనంలో స్వామి వారికి పూజలు జరుగుతూ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుంది. ఇప్పటి వరకు ఆలయానికి ఉత్తర రాజగోపురం మాత్రమే ఉండేది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ధర్మశ్రీ చొరవతో ఆలయానికి రూ.3కోట్ల వ్యయంతో తూర్పు, పశ్చిమం, దక్షిణ రాజగోపురాలు నిర్మించారు. ఈనెల 27 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.
చింతామణి గణపతి దత్తక్షేత్రం
అనకాపల్లి: సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో స్వామివారి నవరాత్రులు ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చింతామణి గణపతి ఆలయం భారతదేశంలోనే ఏకై క అతిపెద్ద గణపతి ఆలయంగా అనకాపల్లి మండలం జీవీఎంసీ విలీనగ్రామైన జాతీయ రహదారి సిరసపల్లి గ్రామంలోప్రసిద్ధి పొందింది. జాతీయ రహదారి తాడి రైల్వే స్టేషన్ సమీపంలో స్వామివారి ఆలయం ఉంది. చింతామణి గణపతిని ధ్యానించినా, పూజించినా, స్మరించినా లేదా దర్శించినా కోరిన వరాలు ఇచ్చే దైవంగా భక్తుల విశ్వాసం. అవదూత దత్త పీఠాధిపతి పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ అమృత హస్తాలతో 2012 జనవరి 25వ తేదీన విగ్రహ ప్రతిష్ట చేశారు. ప్రతి ఏడాది వినాయక నవరాత్రులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఏనుగు తొండంలో చూడముచ్చటగా...
నాతవరం: జిల్లేడుపూడి పంచాయతీలో మర్రిచెట్టు ఊడల మధ్యలో సర్వాంగసుందరంగా నిర్మించిన నూకాలమ్మ ఆలయానికి ఎడమవైపు ఏనుగు నోటిలోంచి కన్పించే విధంగా చూడముచ్చటగా వినాయకుడి ఆలయం ఉంటుంది. అమ్మవారికి కుడి వైపున 30 ఎత్తులో నాగసర్పంతో కూడిన శివలింగం ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ దట్టమైన అటవీప్రాంతంలో తాటాకు పాకలో నూకాలమ్మ తల్లిని ఈ ప్రాంతీయులు పూజించేవారు. ఏలేరు కాలువ నిర్మించే సమయంలో నాతవరం మండలం జిల్లేడుపూడిలో ఎత్తయిన కొండ అడ్డుగా ఉండడంతో అక్కడ సొరంగం తవ్వాలని నిర్ణయించారు. సొరంగం పనులు చేస్తుండగా యంత్రాలు మొరాయిస్తున్నాయి..కూలీలు మరణిస్తున్నారు..పనులు జరగడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో స్థానిక పశువుల కాపరి సూచన మేరకు కాంట్రాక్టర్ ప్రభాకర్ చౌదరి మరుసటి రోజు తాటాకు పాకలో ఉన్న అమ్మవారిని దర్శంచుకున్నారు. సొరంగం పూర్తయితే ఆలయ నిర్మాణం చేస్తామని మొక్కుకున్నారు. దీంతో అనుకున్న సమయం కంటే ముందుగానే సొరంగం పనులు పూర్తి చేసి స్టీల్‌ప్లాంటుకు నీరు సరఫరా చేసేశారు. అన్నమాట ప్రకారం అలయాలు సర్వాంగసుందరంగా నిర్మించి ప్రతి ఏటా పండగలు చేస్తున్నారు. ఇటీవల ఆలయ నిర్మాణకర్త ప్రభాకర్ చౌదరి మరణించడంతో జిల్లేడుపూడికి చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు పండగలు చేస్తున్నారు. వినాయుకుడి ఆలయం ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఎనుగు తొండలోంచి కనిపించేలా నిర్మించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఏటేటా పెరిగే కార్యసిద్ధి గణపతి

ఏటేటా పెరిగే కార్యసిద్ధి గణపతి