
సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ఆందోళన
సాక్షి,పాడేరు: జిల్లాలోని గిరిజన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు అర్హులకు తల్లికి వందనం ప్రభుత్వం అమలుచేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వారు లక్ష్యపెట్టలేదు. గిరిజన విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. వైద్య ఆరోగ్య సేవలను విస్తృతం చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా ప్రతి విద్యార్థికి రూ.15వేలు తల్లికి వందనం నగదు చెల్లించాలని, అన్ని మండల కేంద్రాలలో గిరిజన విద్యార్థులకు కళాశాల హాస్టళ్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. యూనిఫాంను పంపిణీ చేయాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కార్తికో శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సంక్షేమంపై నిర్లక్ష్యం చేస్తుందన్నారు.అనంతగిరి మండల కేంద్రంలో ఇంటర్ విద్యార్థులకు హస్టల్ సౌకర్యం లేక అద్దె ఇళ్లలో నివాసాలు ఉంటున్నారన్నారు.గిరిజన విద్యార్థుల న్యాయ సమ్మతమైన సమస్యల పరిష్కారానికి శాంతియుత ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులతో నిర్బంధించడం అన్యాయమన్నారు. గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు
విడుదల చేయాలని డిమాండ్
అర్హులందరికీ తల్లికి వందనం అమలు చేయాల్సిందే
కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నినాదాలు