
నాణ్యమైన విద్య అందించాలి
● మెనూ పక్కాగా అమలు చేయాలి
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయటౌన్: విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనాలు వండి వడ్డించాలని, నాణ్యమైన విద్య అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డలోని పాఠశాల ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డుల తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే మత్స్యలింగం సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కాచి చల్లార్చిన నీటిని అందించాలని, వేడిగా ఉన్న భోజనాలు మాత్రమే ఇవ్వాలని, మధ్యాహ్నాం మిగిలిపోయిన భోజనాలను రాత్రి పూట ఎట్టి పరిస్థితిలో పెట్టవద్దని సూచించారు.విద్యార్థులు రోగాల బారిన పడితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని హెచ్‌ఎం సీమోన్, వసతి గృహం నిర్వాహకుడు గంగా ప్రసాద్‌కు ఆదేశించారు. విద్యార్థులు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని, నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉధృతంగా ప్రవహించే గెడ్డలు దాటవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. అత్యవసర సేవల నిమిత్తం 100, 108 సేవలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే మత్స్యలింగం వెంట అనంతగిరి వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, డుంబ్రిగుడ మండల పార్టీ ఉపాధ్యక్షుడు నర్సింగరావు తదితరులున్నారు.