
ఆరిన చదువుల ‘జ్యోతి’
● క్యాన్సర్‌తో పోరాడుతూ నాగజ్యోతి మృతి
● డీఎస్సీలో 74.40 మార్కులతో ప్రతిభ
జి.మాడుగుల : డీఎస్సీలో ప్రతిభ కనబరిచి, కొద్దిరోజుల్లో టీచర్ ఉద్యోగంలో చేరాల్సిన యువతిని క్యాన్సర్ రూపంలో మృత్యువు కబళించింది. మండలంలోని గాంధీనగరం గ్రామానికి చెందిన మత్స్యరాస నాగజ్యోతి (24) డీఈడీ చదివింది. మెగా డీఎస్సీ (ఎస్‌జీటీ) పరీక్ష రాసిన ఆమె 74.40 మార్కులు సాధించింది. ఎస్టీ కేటగిరీ కావడంతో ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె అనారోగ్యానికి గురైంది. చికిత్స నిమిత్తం రెండు నెలల క్రితం విశాఖలోని కేజీహెచ్‌లో చేరింది. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె తండ్రి మత్స్యరాజు ఐదేళ్ల క్రితం మృతి చెందారు. ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తూ నాగజ్యోతికి ఇంటికి పెద్ద దిక్కుగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆసరాగా నిలుస్తుందని ఆశించిన తల్లి పద్మావతికి కుమార్తె మృతి తీరని లోటు మిగిల్చింది. నాగజ్యోతి మృతికి బీవీకే పాఠశాల కరస్పాండెంట్, ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా సభ్యుడు మత్స్యరాస మత్స్యరాజు, ప్రిన్సిపాల్ తబర్బ రమేష్‌కుమార్, మాజీ ఎన్జీవో సంఘ అధ్యక్షుడు బుక్కా చిట్టిబాబు తదితరులు సంతాపం తెలిపారు.

ఆరిన చదువుల ‘జ్యోతి’