
అన్నదాత సుఖీభవ సమస్యలు పరిష్కరించండి
పాడేరు : అన్నదాత సుఖీభవకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు పథకం వర్తింపజేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని 22 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. భూముల రీసర్వే మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అటవీ హక్కు పత్రాలు ఇచ్చిన రైతుల భూములకు ఆధార్ సీడింగ్ చేసి అన్నదాత సుఖీభవ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పర్యాటకులను జలపాతాల వద్దకు అనుమతించ వద్దన్నారు. సందర్శనను తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ వచ్చే నెల ఆరు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2.98 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారన్నారు. వారం రోజుల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. చౌకధరల దుకాణాలను రెవెన్యూ అధికారులు విసృతంగా తనిఖీలు బియ్యం పంపిణీ విధానం, బియ్యం నాణ్యతను పరిశీలించాలన్నారు. డిపోల వద్ద క్యూ ఆర్ కోడ్ ఉన్న బ్యానర్లను ఏర్పాటు చేయాలన్నారు. దీపం–2 పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను ఇంటింటికి సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డీఆర్వో పద్మలత, సర్వే ఏడీ దేవేంద్రుడు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్