
హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దేవద్దు
● 14 గ్రామాల గిరిజనుల నిరసన
● నిర్మాణం రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
హుకుంపేట: తమ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించవద్దని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి మండలంలోని భూర్జ పంచాయతీలో 14 గ్రామాల ప్రజలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద 14 గ్రామాల గిరిజనులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తక్షణం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మజ్జి హరి, గిరిజన సంఘ ప్రతినిధి తాపుల కృష్ణారావు మాట్లాడుతూ తమ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం విరమించకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ను విరమించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.