
సబ్సిడీకి ఎగనామం
సేంద్రియ సాకుతో
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కన పెట్టి వారిపై ఎరువుల భారం వేస్తూ వెన్నుపోటు పొడుస్తోంది. సేంద్రియ సాగును ప్రోత్సహించే నెపంతో ఎరువుల సరఫరాను నిలిపివేసింది. మరో వైపు సబ్సిడీకి ఎగనామం పెట్టింది. దీంతో ప్రైవేట్ దుకాణాల వద్ద పడిగాపులు కాస్తూ అధిక ధరలకు కొనుగోలు చేయవలసి వస్తోంది.
సాక్షి,పాడేరు: జిల్లాలో గిరిజన రైతులకు ఈఏడాది సబ్సిడీ ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపింది. ప్రకృతి వ్యవసాయం,సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామనే నెపంతో రసాయన ఎరువుల సరఫరాను నిలిపివేసింది. వాస్తవానికి జిల్లాలో 20శాతం మాత్రమే ఆర్గానిక్ పద్ధతిలో వరి,ఇతర పంటలు పండిస్తున్నారు. 80శాతం భూముల్లో రసాయన ఎరువులనే వినియోగిస్తున్నారు. గిరిజన రైతులంతా ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎరువులపైనే ఆధారపడుతున్నారు. ఖరీఫ్‌లో 54వేల హెక్టార్లలో వరి, 17వేల హెక్టార్లలో రాగులు, ఐదు వేల హెక్టార్లలో చిరుధాన్యాల పంటలను సాగుచేస్తున్నారు. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా,డీఏపీ, ఇతర ఎరువులను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయకుండా గిరిజన రైతులకు ఇబ్బందులకు గురిచేస్తోంది.
ప్రైవేట్ డీలర్లే దిక్కు
కూటమి ప్రభుత్వం సబ్సిడీపై ఎరువుల పంపిణీకి మంగళం పాడడంతో ప్రైవేట్ డీలర్లే రైతులకు దిక్కయ్యారు. జిల్లా వ్యాప్తంగా 56 ఎరువులు దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా ఏడాదిలో సుమారు రూ.5.60 కోట్ల ఎరువులు విక్రయిస్తారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల నుంచి యూరియా,డీఏపీల అమ్మకాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 883 టన్నుల యూరియా, 620 టన్నుల డీఏపీ విక్రయాలు జరిపారు.
రేట్లు పెంచి విక్రయాలు
వ్యవసాయశాఖ యూరియా,డీఏపీల ధరలను నిర్ణయించినప్పటికీ వ్యాపారులు మాత్రం రేట్లు పెంచి అమ్మకాలు జరిపి రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం యూరియాను బస్తా ధర రూ.266, డీఏపీ బస్తా ధర రూ.1350గా నిర్ణయించినప్పటికీ వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచి అమ్మకాలు జరుపుతున్నారు. మండల కేంద్రాల్లో డీఏపీ బస్తాను రూ.1,600కి,వారపుసంతల్లో డిమాండ్ బట్టి రూ.1,700కి అమ్ముతున్నారు.యూరియా బస్తా కూడా రూ.300పైనే విక్రయిస్తున్నారు.ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ దుకాణాల్లో ఎరువుల అమ్మకాలు రోజూ రూ.లక్షల్లో సాగుతున్నాయి.అధిక ధరలతో ప్రైవేట్ మార్కెట్‌లో ఎరువులు కొనుగోలు చేయడానికి గిరిజన రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సబ్సిడీకి ఎగనామం