
సమర్థంగా ప్రభుత్వ పథకాల అమలు
సాక్షి, పాడేరు: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థంగా అమలు చేయాలని దిశ కమిటీ అధ్యక్షురాలు,అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఆదేశించారు.సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ,పర్యవేక్షణ కమిటీ(దిశ)సమావేశాన్ని నిర్వహించారు.గత మూడునెలల్లో డీఆర్‌డీఏ, వ్యవసాయ,పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య,విద్యాశాఖ పరిధిలో జరిగిన అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు.ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు.పథకాల అమలులో ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.కాఫీ రైతులకు అందుతున్న ఉప కరణాలపై ఆరా తీశారు.రూ.10లక్షల విలువైన డ్రోన్‌ను రూ.8లక్షల రాయితీతో ప్రభుత్వం అందిస్తోందని, డ్రోన్ల వినియోగంపై రైతులను చైతన్య పరచాలన్నారు.ఏజెన్సీకి దగ్గరలోనే కాఫీ పల్పింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.సీజనల్ వ్యాధులపై వైద్య బృందాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో ధ్వంసమైన చెక్‌డ్యామ్‌లు,తాగునీటి పైపులైన్‌లకు వెంటనే మరమ్మతులు చేయాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి
జిల్లాను అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. భవనాలు లేని 373 పాఠశాలలకు రూ.45కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.చింతపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి రూ.7కోట్లు మంజూరైనట్టు చెప్పారు.స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించే గిరిజన రైతులకు వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేయాలన్నారు.జాతీయ రహదారిపై పశువుల సంచరిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని,వాటిని నియంత్రించాలని ఆదేశించారు. మహిళా సంఘాలతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని,బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేసి వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలన్నారు.మండల సర్వసభ్య సమావేశాలకు హాజరుకాని మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలుజేయాలనిజెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధికారులను ఆదేశించారు.వ్యవసాయ పరికరాలను గిరిజన రైతులకు వ్యక్తిగతంగా పంపిణీ చేయాలన్నారు.ఏకలవ్య పాఠశాలల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలి
గిరిజనుల సంక్షేమానికి అన్నిశాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని,పాడేరు,అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,రేగం మత్స్యలింగం ఆదేశించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని,అన్ని వ్యవసాయ పరికరాలను గిరిజన రైతులకు పంపిణీ చేయాలని తెలిపారు.గ్రామాల్లో వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్‌గౌడ,సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్,డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరరాజు,డీఈవో బ్రహ్మాజీరావు,జిల్లా వ్యవసాయాధికారి నందు,డీఆర్‌డీఏ పీడీ మురళీ తదితరులు పాల్గొన్నారు.
దిశ కమిటీ అధ్యక్షురాలు, ఎంపీ డాక్టర్ తనూజరాణి ఆదేశాలు