
రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి
● ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో వినతి
● 95 అర్జీలు స్వీకరించిన పీవో
రంపచోడవరం: నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని, రంపచోడవరంలో ట్రైబుల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆదివాసీ చైతన్య వేదిక సంఘం అధ్యక్షుడు వెదుర్ల లచ్చిరెడ్డి, గొర్లె చిన్ననారాయణరావు, తీగల బాబూరావు తదితరులు కోరారు. స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పీవో కట్టా సింహాచలానికి ఈమేరకు వారు అర్జీ అందజేశారు. కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశం లేని పక్షంలో రంపచోడవరాన్ని అల్లూరి జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాలని సర్పంచ్ ఈతపల్లి మల్లేశ్వరి, సరిమల్లి రెడ్డి పీవోకు అర్జీ అందజేశారు.ఇదే మండలంలో నరసాపురం గ్రామానికి చెందిన కాట్రం అప్పన్నదొర తన రేషన్ కార్డులో ఇతరుల పేర్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ అందజేయాలని, పంటలకు ఈ క్రాపింగ్ చేయాలని దేవీపట్నం మండలంలోని సీతాపురం గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులు శిరసం సుబ్బన్నదొర, కుంజం వెంకటరమణ, శిరసం కృష్ణమూర్తిలు కోరారు. ఈ వారం 95 అర్జీలు స్వీకరించినట్టు పీవో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారవేదికలో రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ తదితరులు పాల్గొన్నారు.
భూమి సమస్య పరిష్కరించండి
రంపచోడవరం మండలం చిన్న బీరంపల్లి గ్రామంలో సర్వే నంబర్ 48/2ఏలో 1.94 సెంట్ల భూమిలో తాతల కాలం నాటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్నామని, అయితే తనకు తెలియకుండా ఆ భూమి మరొకరి పేరున మారిపోయిందని గ్రామానికి చెందిన పంచా చెల్లన్నదొర అర్జీలో పేర్కొన్నారు.గత శుక్రవారం గుర్తు కొంత మంది భూమిని కొనుగోలు చేయడానికి రావడంతో ఈ విషయం బయటపడినట్టు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, భూమికి సంబంధించిన నష్టపరిహారం కొంత వరకే ఇచ్చారని కచ్చులూరు గ్రామానికి చెందిన బేలం సీతారాములు ఫిర్యాదు చేశారు.