
వచ్చే నెల1వ తేదీ నుంచి పాఠశాలల్లో ఆధార్ నమోదు
పాడేరు : ఇప్పటి వరకు ఆధార్ నమోదు కానీ విద్యార్థులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలల్లో ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో సోమవారం పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇప్ప టి వరకు ఆధార్ నమోదు కానీ ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయస్సు గల వారు 21,630 మంది, 15–17 సంవత్సరాల వయస్సు గల వారు 10,969 మంది ఉన్నారన్నారు. రెండు నెలల్లోగా వీరికి ఆధార్ పక్కాగా నమోదు చేయాలని తెలిపారు. పాఠశాలల్లో నెట్‌వర్క్ సౌకర్యం లేకపోతే దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి తీసుకువెళ్లి ఆధార్ నమోదు చేయాలని సూచించారు. ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా కనీసం 800 మందికి ఆధార్ నమోదు చేయా లని ఆదేశించారు. ఆధార్ నమోదుకు నిర్ధేశించిన మేరకు నగదు వసూలు చేయాలని, అదనంగా తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, గ్రామ, వార్డు సచివాలయం నోడల్ అధికారి పి.ఎస్. కుమార్, జీఎస్ డబ్ల్యూఎస్ జిల్లా సమన్వయకర్త సునీల్, ఆధార్ కో ఆర్డినేటర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ