
విఘ్నాలు తొలగించే ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి
రేపటి నుంచి నవరాత్రులు ప్రారంభం
దేవదాయ శాఖ ఏర్పాట్లు
నక్కపల్లి: హిందువుల మొదటి పూజ వినాయకుడికే.. విఘ్నాలు తొలగించాలని వేడుకుంటారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక నవరాత్రి మహోత్సవాలకు ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి ఆలయం సిద్ధమవుతోంది. గ్రామీణ జిల్లా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. చవితినాడు అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, తుని, అన్నవరం, పాయకరావుపేట, నక్కపల్లి, తదితర పట్టణాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రానున్నారు.
ఆలయ చరిత్ర..
ఒడ్డిమెట్ట కై లాసగిరిపై దాదాపు నూరేళ్ల క్రితం తాటిచెట్టు మొదలులో లక్ష్మీగణపతి వెలిశాడని పూర్వీకుల కథనం. నామవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి స్వామివారు కలలో కనిపించి కై లాసగిరిపై ఫలానా చోట తాను వెలిసినట్లు చెప్పడంతో అక్కడ తవ్వకాలు జరుపగా విగ్రహం బయటిపడింది. ఐదో నంబరు జాతీయ రహదారికి ఆనుకుని పందెర వేసి విగ్రహం పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. రహదారిపై ప్రయాణించే వారు కానుకల రూపంలో వేసిన ఆదాయంతోపాటు విరాళాలు సేకరించి కొండపై ఆలయాన్ని నిర్మించారు. తర్వాత ఈ ఆలయం దేవదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. చవితినాడు ఇక్కడ పెద్ద తిరునాళ్లు జరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు, కొత్త వాహనాలు కొన్నవారు తొలుత ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజలు చేసిన తర్వాత తమ పనులు ప్రారంభిస్తారు. ఈ ఆలయంలో గణపతిని దర్శించుకుని చేపట్టిన ప్రతి అభివృద్ధి పని నిర్విఘ్నంగా పూర్తవుతుందనేది భక్తుల నమ్మకం. ఇలా తమ కోర్కెలు నెరవేరిన భక్తులు ఇచ్చిన విరాళాలతోనే పలు అభివృద్ధి పనులు చేపట్టడం గమనార్హం. ఇక్కడ గణపతి, కాశీవిశ్వేశ్వర, కనకదుర్గ, నవగ్రహ, లక్ష్మీనారాయణ ఆలయాలు ఉన్నాయి.
ఇలవేల్పుగా వినాయకుడికి పూజలు..
ఒడ్డిమెట్ట గ్రామస్తులు లక్ష్మీగణపతిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. సంక్రాంతి, ఉగాది తర్వాత అంత ప్రాధాన్యతగా వినాయక చవితిని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. చవినినాడు బంధువుల రాకతో ఇళ్లన్నీ సందడిగా ఉంటాయి. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక్కరికై నా గణపతి పేరు ఉండటం గమనార్హం.
నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తి...
నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థాన పాలక మండలి చైర్మన్ పైలా నూకన్ననాయుడు, అర్చకుడు జయంతి గోపాలకృష్ణ తెలిపారు. ఉదయం 5 గంటల నుంచే స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. 27వ తేదీ రాత్రి సాయంత్రం స్వామివారి కల్యాణం జరుగుతుందన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం బారికేడ్లు, క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు. రూ. 20 ప్రత్యేక దర్శనం కోసం టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణ దర్శనం కల్పిస్తున్నారు..
పోలీసు బందోబస్తు...
వేలాది మంది భక్తులు తరలి రానుండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నక్కపల్లి సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబుల పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల మార్గం వరకు వాహనాలను అనుమతించకుండా రోడ్డుపైనే పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నక్కపల్లి, పాయకరావుపేటల నుంచి పోలీస్ సిబ్బందిని రప్పించి బందోబస్తు నిర్వహిస్తామన్నారు. గతేడాది ప్రభుత్వ నిధులు, దాతల విరాళాలు సేకరించి రూ.20 లక్షలతో కొండపైకి సీసీరోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో పాత రోడ్డును ఆనుకుని నిర్మించిన రోడ్డులో భక్తులు కొండపైకి చేరుకోవచ్చు.
జాతరకు తరలిరానున్న వేలాది మంది భక్తులు

విఘ్నాలు తొలగించే ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి