
కలెక్టర్ దృష్టికి సమస్యలు
రంపచోడవరం: జిల్లా కేంద్రం పాడేరులో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగిన జిల్లా డవలప్‌మెంట్ కోఆర్డినేషన్, మోనటరింగ్ కమిటీ సమావేశంలో పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు రంపచోడవరం ఎంపీపీ బంధం శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. రంపచోడవరం నియోజవకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయవద్దని తెలియజేశామన్నారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో రిఫరల్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని, అంబులెన్స్ సౌకర్యం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందించి ఆస్పత్రి పరిశీలించి సమస్యలపై రంపచోడవరంలోనే సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రంపచోడవరం మండలంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన నాడు–నేడు నిధులతో చేపడుతున్న ఏడు పాఠశాల భవనాలు పనులు పూర్తి చేయాలని, భవనాలు లేకుండా ఉన్న మూడు పాఠశాలలకు భవనాలు మంజూరు చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ దృష్టి తీసుకువెళ్లినట్టు ఆమె చెప్పారు. శిథిలావస్దలో ఉన్న పాఠశాలలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని కోరామన్నారు. జాతీయ రహదారికి సంబంధించి ఐ,పోలవరం జంక్షన్‌లో బస్‌షెల్టర్ నిర్మించాలని కోరగా కలెక్టర్ దినేష్‌కుమార్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులను పిలిచి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, హైవే నిర్మాణంలో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశించారన్నారు. రోడ్డుపై పశువుల సంచారంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని డీపీవోకు సూచించారు. హైవేపై గ్రామాల వద్ద వీధిలైట్లు ఏర్పాటు, ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సమావేశంలో తెలిపారు. దిరిసనపల్లి–పెనికలపాడు గ్రామాలకు మధ్య రోడ్డు లేదని, రహదారి నిర్మించాలని కోరినట్టు ఆమె చెప్పారు. దీంతో కొత్త రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారన్నారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగ్గురే ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్పీ ఫలితాలు ప్రకటించడంతో కొత్త ఉపాధ్యాయులు వస్తారని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ గృహ నిర్మాణ బిల్లులు, పంచాయతీలకు, మండల పరిషత్‌లకు బిల్లులు, ఎంపీటీసీ గౌరవ వేతనాలపై సత్వర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు ఆమె తెలిపారు.