
లభ్యం కానీ యూట్యూబర్ ఆచూకీ
● డుడుమ జలపాతంలో ముమ్మరంగా గాలింపు
ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని డుడుమ జలపాతం ప్రవాహంలో శనివారం సాయంత్రం గల్లంతైన యూట్యూబర్ సాగర్ కుండు(22) ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు . ఆదివారం ఉదయం నుంచి కోరాపుట్టు ఓడ్రాఫ్ బలగాలు,లంతాపుట్టు అగ్నిమాపక సిబ్బంది జలపాతంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. డుడుమ జలాయశం నుంచి ప్రాజెక్టు అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. వరదనీటి ఉధృతి కారణంగా గాలింపులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి ప్రవాహాన్ని అధికారులు తగ్గించారు. గల్లంతైన సాగర్‌కుండు తండ్రి సార్థక్ కుండు, బంధువులు బరంపురం నుంచి డుడుమ జలపాతం వద్దకు వచ్చారు. బీటెక్ చదువుతున్న తన కుమారుడు ఇలా ప్రమాదంలో గల్లంతు అవడంతో వారు రోదించారు. రా నాన్నా అంటూ పిలవడం అందరినీ కంటతడి పెట్టించింది. గాలింపు చేస్తున్న ఓడ్రాఫ్ బలగాలకు సాగర్‌కుండుకు చెందిన బ్యాటరీ, బ్యాగ్‌లు లభ్యమయ్యాయి. సాయంత్రం 6గంటల వరకు గాలింపులు చేసినా ఫలితం లేకపోయింది. చీకటి పడటంతో గాలింపులు నిలిపి వేశారు. సోమవారం ఉదయం నుంచి మళ్లీ గాలింపు చేపడతామని అగ్నిమాపకశాఖ అధికారి ఉమేశ్‌బాగ్ తెలిపారు.