
ఆరేళ్ల తర్వాత కబడ్డీ పండగ
విశాఖ స్పోర్ట్స్: ఆరేళ్ల విరామం తర్వాత.. కబడ్డీ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) తిరిగి విశాఖపట్నానికి వస్తోంది. 12వ సీజన్ తొలి దశ పోటీలకు మహానగరం ఆతిథ్యం ఇవ్వనుండగా.. స్థానిక ఫ్రాంచైజీ తెలుగు టైటాన్స్ సొంత అభిమానుల మధ్య టైటిల్ వేటకు సిద్ధమవుతోంది. గత సీజన్‌లో కేవలం త్రుటిలో ప్లేఆఫ్ అవకాశాన్ని కోల్పోయిన టైటాన్స్.. ఈసారి హోమ్ అడ్వాంటేజ్‌ను సద్వినియోగం చేసుకొని చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది.
యువ, అనుభవాల మేళవింపు : ఈసారి వేలంలో రూ.4.5 కోట్లు ఖర్చు చేసి టైటాన్స్ యాజమాన్యం పక్కా ప్రణాళికతో జట్టు కూర్పు చేసింది. డైనమిక్ ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించగా.. అతనికి శుభం షిండే డిఫెన్స్‌లో అండగా నిలవనున్నాడు. శంకర్, భరత్, గణేష్ ఆల్‌రౌండ్ ప్రతిభ చూపనున్నారు. రైడింగ్‌లో చేతన్, నితిన్, ప్రపుల్, జై భగవాన్, మంజీత్, ఆశీష్ వంటి స్టార్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అజిత్, సాగర్, అంకిత్ వంటి యువ డిఫెండర్లను అనుభవంతో సమతుల్యం చేసి, ఒత్తిడిని అధిగమించేలా వ్యూహాలు రచించింది. ఈసారి జట్టు కూర్పు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగేందుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది.
విశాఖలో టైటాన్ షెడ్యూల్ ఇదే.. : పోర్ట్ ఇండోర్ స్టేడియం వేదికగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఈ నెల 29న తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ మధ్య సీజన్ ప్రారంభ మ్యాచ్ జరగనుంది. 30న యూపీ యోధాస్‌తో, సెప్టెంబర్ 4న జైపూర్ పింక్ పాంథర్స్‌తో, 7న బెంగాల్ వారియర్స్‌తో, 10న యు ముంబతో టైటాన్స్ జట్టు తలపడనుంది. విశాఖ వేదికగా ప్రతి రోజూ రెండు మ్యాచ్‌లు చొప్పున మొత్తం 28 లీగ్ మ్యాచ్‌లు జరగనుండటంతో.. నగరంలో కబడ్డీ ఫీవర్ తారస్థాయికి చేరనుంది.